దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ వందల సంఖ్యలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కనిపెట్టిన మందులతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీన పడి లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. 
 
శాస్త్రవేత్తలు, వైద్యులు కరోనాకు మందుకు కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు సముద్రంలోని నాచుతో కరోనాకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. సముద్రంలో లభ్యమయ్యే ఎరుపు రంగు నాచుకు కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని అంటున్నారు. శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లను ఎరుపు రంగు నాచు సమర్థవంతంగా ఎదుర్కోగలదని చెబుతున్నారు. 
 
పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్‌లు కరోనా లాంటి వైరస్ లకు యాంటీ వైరల్ ఏజెంట్లుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎరుపు నాచుతో శానిటైజర్లను తయారు చేసి వైరస్ చేరకుండా చేయవచ్చని రిలయన్స్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మందులను, శానిటైజర్ లను కొంతమందిపై పరిశోధనలు జరిపి మార్కెట్లోకి తీసుకొస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో నిన్నటివరకు 531 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో 420 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా సోకి 16 మంది మృతి చెందగా ఏపీలో ఏడుగురు మృతి చెందారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ కరోనా భారీన పడి 300 మంది మృతి చెందారు. మరోవైపు రేపటితో లాక్ డౌన్ ముగుస్తుండటంతో ప్రధాని మోదీ ప్రకటన గురించి దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోదీ ఈరోజు లాక్ డౌన్ గురించి కీలక ప్రకటన చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: