వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం పరిశీలించారు. సీఎం వెంట హోమ్ మంత్రి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షాలు, వరదలపై అధికారులు, మంత్రులతో సమీక్ష జరిపారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ సైతం రాశారు. వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం 4వేల 450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ ఆసరా కిందవెంటనే 2వేల 250 కోట్లు సాయం అందించాల్సిందిగా సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు.
వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వరద వస్తూ ఉండటంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం ఇరగేషన్ కార్యాలయంలో వరదలపై మంత్రి అనిల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాజెక్టుల్లో సమస్యలు, చెరువులకు గండ్లు, కృష్ణ-గుంటూరు జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులతో సమీక్షించారు మంత్రి. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తగిన జాగ్రతలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు.
మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నందున కోస్తాంధ్ర, దక్షిణాంధ్రల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం మంగళవారం మరింతగా బలపడనున్నట్లు వాతావరణం శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో పెరగనున్న అలలు ఉధృతి, సముద్ర తీరం వెంట 45 కిలో మీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి