జిహెచ్ఎంసి ఎన్నికల పోరు... పరుగులు తీస్తున్న కార్యకర్తలు. పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్తున్న కమలం కింగ్లు. అవును బీజేపీ వారి అజెండా చూస్తుంటే ఎంతటి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుంది. బహుశా ఇది "దుబ్బాక టు తిరుపతి వయా జిహెచ్‌ఎంసి" అనే పక్కా ప్రణాళికతో తెలుగు రాష్ట్రాలు చుట్టేస్తున్న కమలం గుర్తు. అధికార పార్టీ సంగతి అటుంచితే.... జాతీయ పార్టీ బిజెపి చూపుతున్న అంతులేని ఆసక్తి అర్థం కాకుండా ఉంది. అధినేతలను గ్రేటర్ ఎన్నికల బరిలోకి దింపడంలో వెనకున్న ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఏకంగా కేంద్రం నుండే అధికారులు జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం కోసం రంగంలోకి అడుగు పెడుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కేంద్రం లోని కీలక నాయకులంతా గ్రేటర్ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నారా...? ఇటువంటి సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో ప్రత్యక్షమవడం కూడా ఇందులో భాగమా అంటూ మరో ప్రశ్న....ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇంత హడావిడి చూడలేదు. కాకపోతే దుబ్బాక విజయం కమలనాథులకు కొత్త ఉత్సాహాన్ని నింపి... సరికొత్త బాధ్యతలను గుర్తు చేసింది అంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు.

ఇక ప్రచార కార్యక్రమాల ముగింపుకు సమయం దగ్గర పడడంతో మరింత పకడ్బందీగా వ్యూహాలు రచిస్తూ తలమునకలై ఉన్నాయి అని పార్టీలు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికలలో కనుక బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థులు విజయం సాధిస్తే...మిషన్ మోడీ కి సమాధానం దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు బీజేపీ ని చాలా తేలికగా తీసుకుంటున్నాయి. తెరాస బలంగా ఉన్న దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేయడం వలన ఒక్కసారిగా తెరాస లో వణుకు మొదలయిందని చెప్పొచ్చు. దీనితో అలెర్ట్ అయిన తెరాస ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీ కి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సాధించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏమి జరగనుందో తెలియాలంటే ఒక వారం రోజులు ఆగితే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: