తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించి కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు కూడా చర్చించుకున్నారు. అయితే అది పలు సార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిపై ప్రచారం జోరందుకుంది. కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం రెండో ముఖ్యమంత్రి గా ఫిబ్రవరి18న కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. ఈ మేరకు బ్రాహ్మణ పురోహితులు ముహూర్తం నిర్ణయించారని,  కేసీఆర్ కూడా అన్ని ఏర్పాాట్లు  చేస్తున్నారని తెలుస్తోంది.

 కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకానికి ముందు సీఎం కేసీఆర్ మరోసారి చండీయాగం చేస్తారని చెబుతున్నారు. గతంలో కేసీఆర్ మూడు సార్లు యాగం చేశారు. అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం నిర్వహిస్తారని సమాచారం. ఆ యాగాలు పూర్తయిన తర్వాత కొడుకుకు పట్టాభిషేకం చేస్తారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. గత రెండు నెలలుగా కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం జోరుగా జరుగుతుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు సీఎంగా అర్హతలు ఉన్నాయంటూ సమర్ధిస్తున్నారు.

         కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి ముందు లేదా తరువాత మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించనున్నారని తెలిసింది. పార్టీ అధినేత గా కేసీఆర్ కొనసాగనున్నారు. కేటీఆర్ 2014 నుంచి రాష్ట్ర మంత్రిగా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నారు. ఈ మధ్య చాలామంది సీనియర్ నేతలు సైతం కేటీఆర్ త్వరలో రాష్ట్రానికి సీఎం అవుతారని చెబుతున్నారు.  అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం అలాంటిదేమి ఉండదని కొట్టి పారేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే మరో మూడేళ్ల వరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని పదేపదే చెబుతున్నారు. మొత్తం మీద కేటీఆర్‌ సీఎం అవుతారా లేదా అన్న విషయం చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: