లండన్: బళ్లు ఓడలు అవడం.. ఓడలు బళ్లు అవడం అనే సామెత అందరికి తెలిసే ఉంటుంది. బిట్ కాయిన్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. పదేళ్ల క్రితం దేనికీ ఉపయోగపడదు అని అనుకున్న బిట్ కాయిన్ ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. యూకేలో ఓ వ్యక్తి చేతులారా వేల కోట్లను చేజార్చుకున్నాడు. ఎలా అంటే..  జేమ్స్ హావెల్స్ అనే ఓ వ్యక్తి అనుకోకుండా హార్డ్ డ్రైవ్‌ను చెత్తలో పారేశాడు. ఇప్పుడు ఆ హార్డ్ డ్రైవ్‌ను తిరిగి ఎలాగైనా కనిపెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుపుతూ వస్తున్నాడు.

బిట్ కాయిన్‌కు, హార్డ్ డ్రైవ్‌కు, వేల కోట్లకు అసలు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? బిట్ కాయిన్ అనేది మైనింగ్ చేయడం ద్వారా వస్తుంది. కొద్ది సంవత్సరాల క్రితం జేమ్స్ అనే వ్యక్తి మైనింగ్ చేసి బిట్ కాయిన్లను సంపాదించడం మొదలుపెట్టాడు. అలా ఏకంగా 7,300 బిట్ కాయిన్లను వెనకేశాడు. వాటి విలువ ఇప్పుడు దాదాపు రూ. 2800 కోట్లు. కానీ.. జేమ్స్ ఆ బిట్ కాయన్లను సంపాదించే సమయానికి వాటికి పెద్ద వ్యాల్యూ లేదు. అందుకేనేమో జేమ్స్ కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ బిట్ కాయిన్లు ఉన్న హార్డ్ డ్రైవ్‌ను అనుకోకుండా పనికి రాదేమో అనుకుని చెత్తలో పడేశాడు. ఇప్పుడు ఒక్క బిట్ కాయిన్ ధర 36 వేల డాలర్లు.. అంటే మన కరెన్సీలో 26.37 లక్షలుగా ఉంది. దీంతో హార్డ్ డ్రైవ్ కోసం వెతకగా.. దాన్ని పారేసినట్టు తెలుసుకున్నాడు.

ఇక వెంటనే మున్సిపల్ సిబ్బంది వద్దకు వెళ్లి ఎలాగైనా తన హార్డ్ డ్రైవ్‌ను వెతికి పెట్టాలంటూ వేడుకున్నాడు. కానీ.. వాళ్లు మాత్రం అది కుదరని పని అని, డంపింగ్ యార్డ్ మొత్తం వెతకాలంటే కోట్లలో ఖర్చు అవుతుందంటూ చెప్పారు. అయితే తన హార్డ్ డ్రైవ్ దొరికితే 25 శాతం షేర్ ఇస్తానని జేమ్స్ ఆఫర్ చేశాడు. ఒక వేళ హార్డ్ డ్రైవ్ దొరకకపోతే పరిస్థితి ఏంటంటూ మున్సిపల్ సిబ్బంది తిరిగి జేమ్స్‌ను ప్రశ్నించింది. దీంతో జేమ్స్‌కు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా ఓ హెడ్జ్ ఫండ్ హార్డ్ డ్రైవ్‌ను వెతికేందుకు అవసరమైన ఖర్చును తాము భరిస్తామంటూ ముందుకొచ్చింది. మరి ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది అంగీకరిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: