తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎం కె స్టాలిన్ మీద తండ్రి, రాజకీయ దిగ్గజం కరుణానిధి ప్రభావం నూరు శాతం ఉందని అంటున్నారు. ఆయనకు రాజకీయ గురువుగా కరుణనే చెబుతారు. కేవలం ఇరవయ్యేళ్ళ ప్రాయం నుంచే రాజకీయాల మీద మక్కువ పెంచుకుని తండ్రి అడుగు జాడలలో నడిచిన స్టాలిన్ ఈ రోజుకు ముఖ్యమంత్రి అయినా ఆయన అనుభవం అన్ని విషయాల్లోనూ అపారం.

పైగా తమిళనాడు రాజకీయాలను ఆయన ఔపోసన పట్టేశారు. అలాగే తమిళనాడు రాష్ట్ర పరిస్థితులు కూడా పూర్తిగా ఆయనకు తెలుసు. మరో వైపు చూస్తే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో తమిళ పాలకులు  సరికొత్త ఫెడరల్ సూత్రలను ఏనాడో తయారుచేసి ఉంచారు. వారు దాన్ని తూచా తప్పకుండా సూత్రాలను పాటిస్తారు. స్టాలిన్ కి ముందు 13 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ ఎవరూ కూడా కేంద్రంలోని ప్రభుత్వాలతో ఏ రకమైన అనవసర‌ పేచీలూ పెట్టుకోలేదు.

పైగా కేంద్రం లో ఎటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా తమిళనాడు అభివృద్ధికి తగినన్ని నిధులు తెచ్చుకోవడం కూడా జరుగుతూ వచ్చింది. కేంద్రంతో సంఘర్షణ పడడం అన్నది తమిళ పాలకులకు అలవాటు లేని విషయం. వారి చూపు అంతా సొంత రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అన్న దాని మీదనే ఉంటుంది. ఇక ఎన్నికలు వచ్చినపుడు రాజకీయాలు కూటములు కట్టడంలోనూ తమిళులు ముందుంటారు. అనాడు మాత్రం వారు తమ ద్రవిడ సిద్ధాంతాలు బయటకు తీసి దానికి అనుగుణమైన వారికే ఓటు వేస్తారు.

ఇపుడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అదే బాటను అనుసరిస్తారు అంటున్నారు. కరుణానిధి అటు సోనియాతో ఇటు మోడీతో కూడా మంచి రిలేషన్స్ కొనసాగించారు. ఆయన గతంలో వాజ్ పేయ్ తోనూ అలాగే స్నేహం చేశారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఇపుడు స్టాలిన్ కూడా అదే పని చేస్తారు అంటున్నారు. దేశంలో మరో మూడేళ్ల వరకూ లోక్ సభ ఎన్నికలు లేవు. అందువల్ల ముందు రాష్ట్రం అన్న విధానమే స్టాలిన్ అనుసరిస్తారు అని చెబుతున్నారు. అందువల్ల ఇప్పటికిపుడు కేంద్రం మీద కాలు దువ్వి మమత కూటమిలోనో మరోదానిలోనో చేరి కేంద్రానికి వ్యతిరేకంగా ఉండరనే స్టాలిన్ విషయంలో వినిపిస్తున్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: