ఇటీవలే రాజధాని ప్రాంత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని రైతుల నిరసన సెగ తీవ్రంగా తగిలింది. రాజధాని ప్రాంతం గుండా వెళ్తున్న ఆమె కాన్వాయ్ ని ఆందోళనకారులు అడ్డుకుని నిరసన తెలియజేశారు. దీంతో పోలీసు రక్షణలో ఆమె తన ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యేకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. స్థానికంగా జగనన్న కాలనీల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే చిన్నప్పల నాయుడిని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసు ఎస్కార్ట్ తో అక్కడినుంచి తప్పించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.


బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పల నాయుడు రామభద్రాపురం మండలంలోని కొండకెంగువ గ్రామంలో జగనన్న కాలనీల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అప్పటికే అక్కడ స్థానికులు ఎమ్మెల్యేపై తీవ్ర అసహనంతో ఉన్నారు. అర్హులకు ఇళ్ల పట్టాలు కేటాయించలేదని, వైసీపీ సానుభూతిపరులకే పట్టాలిచ్చారని ఆరోపించారు. శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. దీంతో ఆయన దాదాపు 2గంటలసేపు కారులోనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత కూడా పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి ఆయన్ను అక్కడినుంచి తరలించగలిగారు. దాదాపుగా గ్రామస్తులంతా ఎమ్మెల్యే కారుని చుట్టుముట్టి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ దశలో ఎమ్మెల్యేపై దాడి జరుగుతుందేమోనన్న భయంతో పోలీసులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ఆయన్ను క్షేమంగా తరలించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే తూతూమంత్రంగా ముగించి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో కూడా స్థానికులు తీవ్ర అలజడి సృష్టించారు. టెంట్లు పడేసి, కుర్చీలు విసిరేశారు.

ఇక టీడీపీ సోషల్ మీడియా ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తోంది. ఎమ్మెల్యేకి ఘోర అవమానం జరిగిందని చెబుతూ సోషల్ మీడియాలో ఆయా వీడియోలను సర్క్యులేట్ చేస్తోంది. టీడీపీ చేస్తున్న ప్రచారం ఎలా ఉన్నా.. స్థానికంగా మాత్రం ఎమ్మెల్యే చిన్నప్పల నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజలనుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని ఆయన ఊహించలేదు.



అటు రాష్ట్రవ్యాప్తంగా మూడురోజులపాటు చేపట్టిన జగనన్న కాలనీల సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మొత్తం 6.09లక్షల శంకుస్థాపనలు జరిగాయి. చివరి రోజు వర్షం కారణంగా పలు చోట్ల తక్కువ వ్యవధిలోనే ఈ కార్యక్రమాలను ముగించారు అధికారులు,

మరింత సమాచారం తెలుసుకోండి: