ఒకపక్క ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మరోపక్క ఎత్తైన కొండలు.. మైదాన ప్రాంతానికి వెళ్లాలంటే స్పిల్ వే నిండా నీళ్ళు.. ఎటు వెళ్లాలో తెలియదు.. ఎలా వెళ్లాలో తోచదు.. ఇది పోలవరం మండలంలోని నిర్వాసితుల దుస్థితి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడంతో ముంపు గ్రామాలలోనే ఉంటున్న ప్రజల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పోలవరం ప్రాజెక్టు వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో మూడు ఏజెన్సీ మండలాల్లో అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వేలేరుపాడు,  కుక్కునూరు మండలాల్లో నిర్వాసితులు ముంపు సమయంలో బోట్ల ద్వారా  కుక్కునూరులోని మైదాన ప్రాంతానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.  కానీ పోలవరం మండలంలో ఉన్న ముంపు గ్రామాల ప్రజలు పరిస్థితి అందుకు భిన్నం. గోదావరికి వరద వచ్చిందంటే ఎక్కడ వారు అక్కడ ఉండాల్సిందే.  వారు ఎటూ వెళ్లడానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం పోలవరం మండలం ఎగువన ఉన్న 18 గ్రామాలు ఉన్నాయి.  అవన్నీ ముంపు గ్రామాలే. అక్కడ నిర్వాసితులకు ఎటువంటి పరిహారం ప్రభుత్వం అందించలేదు.  దాంతో వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదావరి వరద ముంపు పేరుతో కొంతమందిని పలు గ్రామాల నుంచి అధికారులు ఖాళీ చేయించారు. కానీ ఎక్కువ శాతం ప్రజులు గ్రామాల్లోనే ఉండిపోయారు. ఇప్పుడు గోదావరికి వరదలు రావడంతో ఆ గ్రామాల నిర్వాసితులు పరిస్థితి దయనీయంగా మారింది.  ఎటూ వెళ్లలేని పరిస్థితిలో వారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దానికి ప్రధాన కారణం వారు ఎటూ వెళ్లడానికి అవకాశం లేకపోవడమే.

సాధారణంగా గోదావరికి వరదలు వచ్చిన సమయంలో ఈ ప్రాంత వాసులు బోట్లు,  మర పడవల్లొ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వైపు తమ అవసరాల నిమిత్తం వెళతారు. ప్రస్తుతం దేవీపట్నం మండలం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అటు వైపు వెళ్లడానికి ఆస్కారం లేకుండా పోయింది. పోనీ దిగువకు అంటే పోలవరం మండల కేంద్రం వైపు వద్దామనుకుంటే ప్రాజెక్టు స్పిల్ వే నిండా నీరుంది. మరోవైపు ఎత్తైన కొండలు,  దట్టమైన అడవీ ప్రాంతం.  ఇలా అన్ని వైపుల నుంచి నిర్వాసితులకు దారులు మూసుకుపోయాయి.  దాంతో అక్కడ వారంతా ప్రాణ భయంతో వణికిపోతున్నారు.

ప్రస్తుతం గోదావరికి వచ్చింది చిన్నపాటి వరదే.  కానీ  కాపర్ డ్యామ్ ను మూసివేయడంతో గోదావరి నీరు  వెనుకకు ఎగదన్నుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బ్యాక్ వాటర్‌కు తోడు వరద నీరు జతకావడంతో పరిస్థితి దారుణంగా మారింది.  ఇప్పుడు ఆ నీరంతా  గ్రామాల అంచుల వరకు చేరింది. దాంతో  ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిర్వాసిత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. న్యాయపరంగా ప్రభుత్వం నుండి తమకు అందవలసిన నష్టపరిహారాన్ని  అందజేస్తే మాకు మేము గా గ్రామాలు ఖాళీ చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.  అధికారులు మాత్రం వచ్చే నెలాఖరుకల్లా అందరికీ పరిహారం అందజేస్తామని చెబుతున్నారు. మరి ఆ మాటను అధికారులు నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: