రాష్ట్రంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికితో పాటు రాష్ట్రంలో మరో ఆరు ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గ‌తంలోనే ప్ర‌తిపాద‌న‌లు చేసింది. ఈ ప్ర‌తిపాద‌న‌లై పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సుముఖ‌త వ్య‌క్తం చేశారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్డు విస్తరణకు, దాని అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని హామి ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు.



 రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని, హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ సిటీగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలని కేంద్రమంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.


అనేక రంగాల్లో హైద‌రాబాద్ విస్త‌రిస్తుంద‌ని దీని వ‌ల్ల దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, అంత‌ర్జాతీయ న‌గ‌రాల నుంచి న‌గ‌రానికి ప్ర‌యాణీకులు వ‌స్తున్నార‌ని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప‌ట్ట‌ణాల్లో ప్ర‌తిపాదించిన ఆరు విమానాశ్ర‌యాల అభివృద్ధి, ఏర్పాటు, నిర్వ‌హ‌ణ కోసం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర‌మంత్రిని కోరారు సీఎం.  సీఎం కేసీఆర్ ప్రతిపాదనలపై స్పందించిన కేంద్రమంత్రి సింధియా మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీనిచ్చారు. 


 తెలంగాణ ప్రతిపాదించిన ఆరు ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన వరంగల్‌ (మామునూరు)లో ఎయిర్‌పోర్టు అథారిటీకి భూమి అందుబాటులో ఉన్నదని, (ఏఐ) ఏటీఆర్‌ ఆపరేషన్స్‌ ప్రారంభించడానికి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు సింధియా. నిజామాబాద్‌ జిల్లా (జక్రాన్‌పల్లి)లో ఎయిర్‌పోర్టుకు సంబంధించిన టెక్నికల్‌ క్లియరెన్స్‌ ఇస్తామన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టును ఎయిర్‌ఫోర్స్‌ ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని పర్యవేక్షిస్తామని చెప్పారు. పెద్దపల్లి (బసంత్‌నగర్‌), కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ (దేవరకద్ర) ఎయిర్‌పోర్టుల్లో చిన్న విమానాల రాకపోకలకు ఉన్న అవకాశాలపై పునఃపరిశీలన చేసి, చర్యలు తీసుకుంటామని ఈ సంద‌ర్భంగా  సింధియా వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌భుత్వాధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr