కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పై కోవిడ్ టీకాలు పనిచేస్తున్నాయని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కొద్ది మందిలోనే ఈ వేరియంట్ ను గుర్తించినట్టు పేర్కొంది. ఉత్పరివర్తనాల వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది. అటు.. ఓమిక్రాన్ కు 100రోజుల్లో బూస్టర్ డోస్ తయారు చేయనున్నట్టు మోడెర్నా తెలిపింది. కొత్త వేరియంట్ పై ఆస్ట్రాజెనెకా, జాన్స్ అండ్ జాన్సన్ కూడా పరిశోధనలు ప్రారంభించాయి.

ఇక కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పుట్టింది తమ దేశంలో కాదని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది. తమ దేశంలో ఓమిక్రాన్ ను కేవలం కనిపెట్టినట్టు పేర్కొంది. అది ఎక్కడ పుట్టిందో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. అటు అమెరికా, దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కొత్త వేరియంట్ పై వేగంగా స్పందించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిందని మెచ్చుకుంది.

దక్షిణాప్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్ ఓమిక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్ వానా.. బెల్జియం, జర్మనీ, హాంకాంగ్, ఇజ్రాయేల్ దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఓమిక్రాన్ ను గుర్తించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచింది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వేరియంట్ కేసులు ఇప్పటి వరకు ఏడు దేశాల్లో బయటపడ్డాయి.

మరోవైపు మహిళల వన్డే ప్రపంచ కప్ అర్హత టోర్నీ అర్ధాంతరంగా రద్దైంది. జింబాబ్వేలో జరుగుతున్న ఈ టోర్నీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. కరోనా వ్యాప్తి భయంతోనే మ్యాచ్ లను వాయిదా వేసినట్టు ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ టోర్నీని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది ఐసీీసీ వెల్లడించలేదు. అయితే కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దక్షిణాఫ్రికాతో పాటు జర్మనీ చెక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా వెలుగు చూసింది.మరింత సమాచారం తెలుసుకోండి: