కృష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గం రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహ రచనలు ఇప్పటి నుండే మొదలైనట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా మొత్తం పూర్తి కావడంతో పొలిటికల్ పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రజల వద్దకే పాలన అనే నినాదం తీసుకోవడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా ఏదైనా సమస్య పై తనను కలిసి చెప్పాలంటే నేరుగా తనను కలవొచ్చని అపాయింట్మెంట్ కూడా అవసరం లేదంటూ తెలిపారు. వీటితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నూతన కమిటీల నియామకాలు, అలానే పార్టీ గ్రామీణ స్థాయి నుండి పార్టీనీ బలోపేతం చేసేందుకు పక్క ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రతిపక్ష టిడిపి పావులు కదుపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి మూట కట్టుకున్న తెలుగు తమ్ముళ్లు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి తన ఉనికిని చాటుకుంది.. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు ఇచ్చిన బూస్టింగ్ తో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు తెలుగు తమ్ముళ్లు పక్కా వ్యూహ రచన సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టాలనే వ్యూహంతో కొండపల్లి మున్సిపాలిటీ కేంద్రంగా ఒక పెద్ద కార్యాలయం ఏర్పాటు చేయాలని టిడిపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో చక్రం తిప్పిన ఇద్దరు ప్రముఖ పేరున్న నేతలు రంగంలోకి దిగుతున్నట్లు మున్సిపాలిటీ వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీ పాలక వర్గ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి ఎంపి కేశినేని నాని సూచనలు మేరకు ఆ ఇద్దరు నేతలు మైలవరం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జరుగుతున్న ప్రచారం లో వాస్తవం ఎంత, అసలు 2024 ఎన్నికల్లో ఇరు పార్టీల నేతల వ్యూహాలు ఎంత మేర పనిచేస్తాయో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: