కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రికాషన్ డోస్ వ్యవధిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఈ సమీక్షలో నిర్ణయించిన సీఎం.. ప్రికాషన్ డోస్ వ్యవధిని 9నుంచి 6నెలలకు తగ్గింపుపై లేఖ రాయనున్నారు. ప్రికాషన్ డోస్ తగ్గించడం వల్ల ఫ్రంట్ లైన్ వర్కర్లు, అత్యవసర సర్వీసుల సిబ్బందికి ఉపయోగమని సీఎం జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 22వేల 882 టెస్టులు చేయగా.. కొత్తగా 4వేల 108కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఎవరూ చనిపోలేదు. మరోవైపు 696మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30వేల 182యాక్టివ్ కేసులున్నాయి. కరోనా టెస్టులు తగ్గించడంతో కేసుల సంఖ్య తగ్గగా.. నిన్న 30వేల టెస్టులు చేస్తే.. 4వేల 570 కేసులు వచ్చాయి.

ఇక కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. 150మంది పరీక్షలు చేయించుకోగా.. మరికొంత మంది నివేదికలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే ఎన్టీఆర్ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు ఈ 150మంది రాయాల్సి ఉంది.

మార్చిలో 12 నుంచి 14ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేసే అవకాశముంది. ఈ మేరకు కరోనా వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ అరోరా ప్రకటన చేశారు. అయితే ఈ నెల 3వ తేదీన 15 నుండి 18ఏళ్ల వయసు వారికి టీకా పంపిణీ ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 3.5కోట్ల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు.

అయితే కరోనా విజృంభిస్తున్న కారణంగా ఏపీలోని స్కూల్స్ కు వెంటనే సెలవులు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా వల్ల 12రాష్ట్రాల్లో స్కూల్స్ కు సెలవులు ఇచ్చారని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్ర పాలన సాగిస్తున్నరని చంద్రబాబు దుయ్యబట్టారు. ధాన్యం రైతులకు సకాలంలో డబ్బు చెల్లించాలనీ.. నష్టపోయిన కంది, మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: