మంచి భాష కారణంగా ప్రజల్లో నాయకులంటే గౌరవం ఏర్పడుతుంది.మంచి భాష కారణంగా సమయోచితంగా ప్రవర్తించేందుకు వీలు కలుగుతుంది.పరిష్కార సాధన కూడా మనసుకు అందుతుంది.కానీ అవతలి వారు దిగజారుతున్నారు కనుక తామూ అలానే వ్యవహరిస్తున్నాం అంటే ఏం చెబుతాం? అవన్నీ పెద్దగా ఫలితాలు ఇవ్వవు సరికదా నాయకుల పరువును గంగలో కలుపుతున్నాయి అన్నది ఓ నిష్టుర సత్యం.ఈ దశలో మన నాయకులకు ట్యూషన్ పెట్టించాలి. ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్నవి తప్పక బోధించి పంపాలి.అప్పటికైనా వీరిలో మార్పు వస్తుంది అని అనుకోవడం ఓ అత్యాశే!


ఎవరు ఏ తప్పు చేసినా అది రాష్ట్ర ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే వచ్చి చేరుతుంది.ఎవరు ఏ తప్పు మాట్లాడినా కూడా అది జగన్ మోహన్ రెడ్డిని ప్రభావితం చేస్తుంది.రాజకీయ భవిష్యత్ ను ప్రభావితం చేసే విధంగానే ఉంటుంది.ఎవరు ఏ నిర్ణయం వెలువరించినా కూడా అది కూడా ఆయనను డైలమాలోనే పడేస్తుంది.కనుక మాట్లాడేవారంతా కాస్త ఆలోచించాలి.అనాలోచితం అయిన మాట కారణంగానే విభేదాలు పొడసూపుతున్నాయి.వెలుగులోకి వస్తున్నాయి.ముఖ్యంగా మంత్రుల మాట తీరుపై ఇప్పటికీ ఎన్నో సార్లు జగన్ వివాదాల్లో ఇరుక్కున్నారు.అయినా వారిలో మార్పు లేదు సరికదా! జగన్ సర్దిచెబుతున్నదీ లేదు.


ముఖ్యంగా కొడాలి నాని భాషకు సంబంధించి ఓ సారి చూద్దాం.ఆయనేం మాట్లాడినా మాట మొదలు, చివర బూతులే ఉంటాయి.చంద్రబాబును టార్గెట్ చేస్తూ తిడుతుంటారు.ఆయనతో ఉన్న విభేదాలేంటో ఒక్కటంటే ఒక్కటి కూడా పైకి చెప్పరు.పైగా ఆయనొక కోవర్టు అని వైసీపీ వర్గాలే అంటుంటాయి.టీడీపీకి అనుబంధంగా ఉండే వ్యక్తి అని ఇదంతా డ్రామా అని కూడా వైసీపీనే అంటోంది. అలాంటప్పుడు ఆయనను దూరం చేయవచ్చు కదా!

అంటే జగన్ ఎందుకనో సైలెంట్ అయిపోతున్నారు.చంద్రబాబును తిడితే పొలిటికల్ మైలేజీ ఏమయినా పెరిగిపోతుందా అంటే అదీ లేదు. మరెందుకు తిడుతున్నారు.ఆ విధంగా తిట్టడంతోనే రాజకీయాలు చేయాలనుకుంటే అదే వారి అంతిమ నిర్ణయం అయితే ఇక చెప్పేదేముంది?


మంత్రి హోదాలో ఆయన మాట్లాడుతున్నారు సరే టీడీపీ అయినా కాస్త తగ్గాలి కదా! బుద్ధా వెంకన్న నిన్నటి వేళ మాట్లాడిన మాటలు ఏమయినా బాగున్నాయా? ఆయన పై పోలీసు ఎందుకు చర్యలు తీసుకోకూడదు. ఆ మాటకు వస్తే ఇరు వర్గాలపైనా పోలీసు చర్యలు తీసుకోవాల్సిందే. అధికారంలో ఉన్నారు కనుక వైసీపీ తెలివిగా తప్పుకోవచ్చు.కానీ టీడీపీకి ఆ వెసులుబాటు లేదు కనుక తరుచూ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది.అంటే కొడాలి నాని కానీ, బుద్ధా వెంకన్న కానీ రాజకీయంలో కొత్త ఒరవడి ఒకటి సృష్టించేందుకు తహతహలాడుతున్నారని మనం భావించి సర్దుకుపోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: