
ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజం. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. గెలిచిన కాంగ్రెస్ కు 65 సీట్లొస్తే ఓడిన బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వే, మీడియా సంస్ధలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా ముందుగానే అంచనా వేశాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చివరినిముషంలో కేసీయార్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల బీఆర్ఎస్ కు ఘోరఓటమి తప్పింది.
ఇంతకీ కేసీయార్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే చివరి నిముషంలో అభ్యర్ధులను మార్చటం, కొత్త అభ్యర్ధులను రంగంలోకి దింపటమే. అలంపూర్లో సిట్టింగ్ ఎంఎల్ఏ గా ఉన్న అబ్రహంపై వ్యతిరేకత ఉందని ఆయన్ను కాదని విజయుడికి టికెట్ ఇచ్చారు. తాజా ఫలితాల్లో విజయుడు గెలిచారు. జనగాంలో సిట్టింగ్ ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కాదని పల్లా రాజేశ్వరరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈ మార్పు పనిచేయటంతో రాజేశ్వరరెడ్డి గెలిచారు.
అలాగే స్టేషన్ ఘన్ పూర్లో తాటికొండ రాజయ్యను కాదని మరో సీనియర్ నేత కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. శ్రీహరికి టికెట్ ఇవ్వటాన్ని రాజయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా కేసీయార్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తాజా ఫలితాల్లో కడియం గెలిచారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మదన్ రెడ్డి స్ధానంలో సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. మొదటి ప్రకటించిన 115 టికెట్లలో కూడా నర్సాపూర్ టికెట్ ను పెండింగులో పెట్టారు. ఆచితూచి సునీతకు టికెట్ ప్రకటించారు. చివరకు సునీతే గెలిచారు.
కోరుట్ల నియోజకవర్గంలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్ధానంలో కొడుకు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రావుకు కేసీయార్ టికెట్ ఖాయంచేశారు. ఎన్నికల్లో సంజయ్ రావే గెలిచారు. అసిఫాబాద్ నియోజకవర్గంలో ఆత్రంసక్కు స్ధానంలో చివరినిముషంలో కోవాలక్ష్మికి టికెట్ ఖాయంచేశారు. దీనివల్ల కోవానే గెలిచారు. దుబ్బాకలో టికెట్ కోసం చాలామంది ప్రయత్నించారు. అయితే కేసీయార్ మాత్రం ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డకి టికెట్ ప్రకటించారు.
ప్రచారంలో కొత్తపై కత్తితో దాడి, ఆపరేషన్, విశ్రాంతి లాంటివి అందరికీ తెలిసిందే. అయినా చివరకు ప్రభాకరరెడ్డే గెలిచారు. బోధ్ లో రాథోడ్ బాబురావు స్ధానంలో చివరినిముషంలో అనీల్ జాదవ్ కు టికెట్ ఇచ్చారు. చివరకు అనీలే గెలిచారు. ఉప్పల్లో బేతి సుభాష్ రెడ్డి స్ధానంలో బండారు లక్ష్మారెడ్డిని ఎంపిక చేశారు. ఇపుడు బండారే గెలిచారు. చివరినిముషంలో కేసీయార్ మార్పులు చేయకుండా ఉండుంటే...