రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్. అందులో భాగంగా తాజాగా సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో సోమవారం సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీ తేడాలో కాంగ్రెస్ విజయం సాధించింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై కేవలం వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్సు తీసేస్తాం అంటున్నారు. కాంగ్రెస్ మోసపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ కు చేసిందేమీ లేదు. ఐదేళ్లలో ఒక్క పాఠశాల, ఒక్క కళాశాల తీసుకొచ్చాడా? ఒక్క గుడి కట్టాడా ? ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా? ఒక్క రూపాయి పని చేయని బండి సంజయ్ కు ఓట్లు అడిగే అర్హత లేదు.

మోడీ పదేండ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. తెలంగాణకు ఏమి చేయని బీజేపీకి, కరీంనగర్ కు నయా పైసా పని చేయని బండి సంజయ్ కు ఓటు ఎందుకు వేయాలో ప్రజల్లో చర్చ పెట్టాలి. రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు వలన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 10 న కేసీఆర్ రోడ్ షో సిరిసిల్లలో ఉంటుంది.

దానిని ప్రతి కార్యకర్త తరలివచ్చి విజయవంతం చేయాలి. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారు. కష్ట కాలంలో నా వెంట నిలిచిన మీకు నేను అండగా ఉంటాను. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గెలుపు కోసం కష్టపడ్తాను. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై  పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు, కాంగ్రెస్ లో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఎవరు కూడా అధైర్య పడొద్దు.. అందరికి అండగా ఉంటాను అని కేటీఆర్  సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశంలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: