ప్రపంచమంతా అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీగా గుర్తింపు పొందిన మిస్ వరల్డ్ పోటీ విజేతలకు కేవలం కిరీటం మాత్రమే కాకుండా కోట్ల రూపాయల డబ్బులు, విలువైన బహుమతులు, అవకాశాలు లభిస్తాయని మనందరికీ తెలిసిందే. ఇక 2025లో హైదరాబాద్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఘనంగా ముగిసిన 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మిస్ వరల్డ్‌ గా ఎంపికైన ఓపల్ సుచాతకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, స్పాన్సర్ల నుంచి రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ, వజ్రాల కిరీటం, డిజైనర్ దుస్తులు, మేకప్ కిట్లు, నగలు, చెప్పులు వంటి విలాసవంతమైన బహుమతులు అందాయి. అంతేకాకుండా ఏడాది పొడవునా లండన్‌లో వసతి, ప్రొఫెషనల్ పీఆర్, పోషకాహారం, ఫిట్‌నెస్ నిపుణుల సలహాలు ఉచితంగా లభిస్తాయి.

ఓపల్ ఇప్పుడు ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ కార్యక్రమానికి రాయబారిగా వ్యవహరిస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏడాదిపాటు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ విజయం వల్ల సినిమాల్లో అవకాశాలు, మోడలింగ్ కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్మెంట్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఫైనల్ పోటీలకు జడ్జిలుగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్, సుధా రెడ్డి, మిస్ ఇంగ్లండ్ 2014 కెరీనా వ్యవహరించారు. మొత్తం 108 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొనగా, చివరికి 40 మంది ఫైనల్స్‌కి ఎంపికయ్యారు. ఖండాల వారీగా ఒకొక్కరిని క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్‌కు ఎంపిక చేశారు.

మిస్ వరల్డ్ గెలిచిన ఓపల్ ఇప్పుడు ఊహించని అవకాశాల మెట్టు ఎక్కనుంది. గతంలో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ వంటి వారు కూడా మిస్ వరల్డ్ టైటిల్ ద్వారా సినీ రంగం, ప్రపంచ గుర్తింపు అందుకున్నారు. అదే దిశగా ఓపల్ సుచాత ప్రయాణం మొదలు కానుంది. మొత్తంగా  చెప్పాలంటే, మిస్ వరల్డ్ విజేతగా నిలవడం వారి జీవితానికే మారుపేరు. ఇది అంతర్జాతీయ గుర్తింపు మాత్రమే కాకుండా, జీవితాన్ని మలుపు తిప్పే అవకాశాలతో కూడుకున్న ఘనతగా చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: