ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ముఖ్యమైన మార్పులు తెరపైకి వచ్చాయి. గతంలో అమరావతి అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, అధికార నివాసాలు వంటి పరిమిత ప్రమాణాలతోనే అభివృద్ధి కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ ప్రణాళికను విస్తృతంగా మార్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ‘స్వర్ణాంధ్ర 2047’ అనే భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఇచ్చిన సిఫార్సులు ఉన్నాయి. ఇందులో హైటెక్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్సిటీ, సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు, డిఫెన్స్ తయారీ రంగాల సంస్థలు వంటి పలు అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలు ఉన్నాయి.


వీటిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని స్పష్టంగా ప్రతిపాదించారు. ఇప్పటికే పొందిన భూములకు తోడు ఇంకా 44,000 ఎకరాల భూమిని సేకరించి, వీటిలో విస్తృత నిర్మాణాలు చేపట్టే యోచనలో ఉంది ప్రభుత్వం. హైదరాబాద్‌లో ఉన్న హైటెక్ సిటీ కన్నా మెరుగ్గా, అమరావతిలో అధునాతన హైటెక్ సిటీను నిర్మించాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. ఇది పూర్తయితే, ప్రపంచ ఐటీ రంగం దృష్టి కూడా అమరావతిపై పడే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం రాజధాని వ్యవస్థాపన మాత్రమే కాదు, ఆర్థికాభివృద్ధికి మార్గం కూడా అవుతుంది. టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ ప్రణాళికల అమలు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాగలవు.


వేలాది ఉద్యోగాలు లభించేందుకు అవకాశముంది. ముఖ్యంగా యువతకు స్కిల్ డెవలప్మెంట్, కొత్త అవకాశాల కోసం అమరావతి కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గతంలో అమరావతిని ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలన్న దిశగా ప్రయత్నించారు. కానీ పాలనా మార్పుతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ ఆయన అధికారంలోకి వచ్చాక, అమరావతికి ఊపొస్తోంది. ఈసారి మాత్రం ప్లాన్ కేవలం ప్రభుత్వ కేంద్రంగా కాకుండా, వాణిజ్య, టెక్నాలజీ, పరిశోధనా, విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ ప్రణాళికలు సాకారమైతే, అమరావతి కేవలం రాజధానిగా కాకుండా, దక్షిణ భారతదేశంలో టెక్, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ రంగాల కేంద్రంగా ఎదగడం ఖాయం. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే విదేశీ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: