- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, అధికార కూటమిలోకి వచ్చిన టీడీపీజనసేన నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నందున ఇలాంటి భిన్నాభిప్రాయాలు సహజంగా భావించినా, ప్రస్తుతం అవి తీవ్రంగా మారుతూ రెండు పార్టీల ఐక్యతపై సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఎవరికి వారు ‘యమునా తీరే’ అన్నట్లు వ్యవహరిస్తున్న నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా పెద్దగా పట్టించుకోవ‌డం లేదు. ఒకే పాలనలో ఉండి క‌లిసి ప‌ని చేయాల్సి ఉన్నా ఆ ప్రాంతాల్లో సెటిల్‌మెంట్లు, ఇసుక, మద్యం వంటి కీలక వ్యవహారాల్లోనూ నాయకుల మధ్య అధికంగా పోటీలూ, ఘర్షణలూ చోటు చేసుకుంటున్నాయి.


ఇదిలా ఉంటే, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు టీడీపీ శిబిరంలో అసంతృప్తికి దారి తీశాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు ప్రముఖులు అయిన నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, జ‌న‌సేన మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరి బిజినెస్ కోసం చాలా త‌క్కువ ధ‌ర‌కే భూములు కేటాయించారు. వీరిద్దరూ ఇటీవలి ఎన్నికల ముందు వలస వచ్చిన నేతలు కావడంతో, గత కొన్నేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న టీడీపీ సీనియర్ నేతల్లో అసహనం పెరిగింది. తాము ఎంతో నిబ‌ద్ధ‌త‌తో పార్టీ కోసం ప‌ని చేస్తే త‌మ‌ను ప‌క్క‌న పెట్టేసి.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన వారికి కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌డంతో పాటు భారీగా వారికి ల‌బ్ధి క‌లిగించేలా చేయ‌డాన్ని అస్స‌లు త‌ట్టుకోలేక పోతున్నారు.


ఈ వ్యవహారం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. పార్టీ కోసం యేళ్ల‌కు యేళ్లుగా క‌ష్ట‌ప‌డి.. ఎన్నిక‌ల్లో త్యాగం చేసిన వారిని విస్మరించడం సమంజసమా ? అనే ప్రశ్నలు నాయకుల మధ్య చర్చలకు దారితీస్తున్నాయి. పాతవాళ్లను పక్కన పెట్టి కొత్తవాళ్లను కౌగిలించుకోవడం అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతోపాటు, అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన పలు కీలక నేతలు కూడా చంద్రబాబుతో ఈ విషయాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఇలాంటి వాటిపై చంద్రబాబు మరోసారి సమీక్ష జరిపి, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోక‌పోతే ఈ అంతర్గత కలహాలు, ప్రభుత్వ పరిపాలనపై గాడి తప్పించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: