- ( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. ఈ స్థానం మీద పట్టు సాధించాలనే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నోసార్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే గత ఎన్నికల్లో మరోసారి టీడీపీదే పైచేయిగా మిగిలింది.
వైసీపీ వ్యూహాలూ.. వాస్తవ స్థితిగతులూ
గతంలో కుప్పంలో టీడీపీకి భయపడి వెనక్కి తగ్గిన నాయకులను వైసీపీ ఒత్తిడితో తమ వైపుకు తిప్పుకున్నప్పటికీ, అది తాత్కాలికమే అని తర్వాత స్పష్టమైంది. చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన వైసీపీ నాయకులు, ఎన్నికల అనంతరం పూర్తిగా అన్ యాక్టివ్ అయిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన కుప్పంలోనే ఉన్నారని వైసీపీ చెబుతున్నా.. ఆయన కార్యక్రమాలు మాత్రం కనబడడం లేదు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. ఇది కుప్పంలో వైసీపీ పరిస్థితిని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
టీడీపీ వ్యూహాత్మక విజయం – అభివృద్ధికి ప్రాధాన్యం
చంద్రబాబు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి నెల నియోజకవర్గంలో జరిగే పరిణామాలపై సమీక్షలు చేస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, సంక్షేమ పథకాల అమలులో కుప్పం ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ఫైనల్‌గా వైసీపీ నాయకులు యాక్టివ్ గా లేకపోవడం, వారికి ప్రజలతో అనుసంధానం లేకపోవడం, అభివృద్ధి పై దృష్టి పెట్టకపోవడం వంటివి టీడీపీకి కలిసొచ్చిన అంశాలు. చంద్రబాబు కాన్‌సంట్రేషన్ తో కుప్పంలో మళ్లీ టీడీపీ గట్టి పట్టు సాధించినట్టే కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు