
గతంలో వీడియో కాల్ ద్వారా విచారణ జరిగే సమయంలో “నాకు ఏమీ తెలియదు .. కేవలం మంత్రిగా అవసరమైతే సంతకాలు మాత్రమే చేసేవాడిని” అని సమాధానాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అధికారుల ముందు నేరుగా కూర్చోబెట్టడంతో , ఆ మాటలు సులభంగా తప్పించుకునే అవకాశాలు లేవని అంటున్నారు రాజకీయ వర్గాలు. ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీ మార్పులు , ఆర్డినెన్స్‌లపై సంతకాలు , తాను తీసుకున్న నిర్ణయాలు – వీటన్నింటిపై దర్యాప్తు అధికారులు నిశితంగా ప్రశ్నలు సంధిస్తున్నారని సమాచారం. ఇకపోతే , నారాయణ స్వామి మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా అధికారికంగా ఎక్సైజ్ శాఖ సమీక్ష జరిపిన రికార్డులు లేవని మీడియా చెబుతోంది. కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోయిన ఆయన, స్కాం బయటపడిన తరువాత కూడా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వకుండా కుల రాజకీయాలకే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి సిట్ విచారణకు సహకరించకపోవడంతో, ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావించే నారాయణ స్వామి, కేవలం ‘పదవి కోసం కూర్చోబెట్టిన డమ్మీ మంత్రి’ అనే ట్యాగ్‌తోనే కొనసాగారని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మొత్తం మీద, లిక్కర్ స్కాం కేసు క్రమంగా నారాయణ స్వామి మెడలో ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ కేసులో ఆయన జైలుముఖం చూడాల్సిన పరిస్థితి రాకమానదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో సిట్ తీసుకునే నిర్ణయం, ఈ స్కాంలో మిగతా పెద్దల పాత్రపై మరిన్ని బాంబులు పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి.