వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పేరు రావడం వల్ల తీవ్రంగా వివాదాస్పదంగా మారిన దేవాదాయశాఖ ఉద్యోగిని శాంతి వ్యవహారం ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల పూర్తి చేసిన విచారణలో ఆమెపై వచ్చిన అన్ని ఆరోపణలు నిజమని తేలడంతో, ఉద్యోగం నుండి డిస్మిస్‌ చేయాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టుగా సమాచారం. శాంతి విశాఖలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమె నేరుగా విజయసాయిరెడ్డి సూచనల మేరకే పని చేసిందని విపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా ఆలయాల భూముల విషయంలో జరిగిన అక్రమాలు ఆమె పేరుతో బహిర్గతం కావడంతో, ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి. వృత్తిపరంగా మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక వివాదాలు కూడా శాంతిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.


ఈ క్ర‌మంలోనే ఆమె భర్త మదన్ ఒక సంచలన ఆరోపణ చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య శాంతి బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అని ఆయన ఆరోపించడం పెద్ద కలకలం రేపింది. శాంతి మాత్రం ఆసుపత్రి రికార్డుల్లో ఒక లాయర్ పేరును బిడ్డ తండ్రిగా నమోదు చేసింది. దీనిపై మదన్ డీఎన్ఏ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చి, శాంతిని తాను ఒక కూతురిలా ఆదరించానని కౌంట‌ర్ ఇచ్చారు. ఈ వ్యవహారాలన్నింటితో శాంతి మ‌రింత‌గా వార్త‌ల్లోకి ఎక్కారు. ప్రభుత్వానికి రాంగ్ స‌మాచారం ఇవ్వ‌డం, వ్య‌క్తిగ‌తంగాను వివాదాల్లో చిక్కుకోవ‌డంతో పాటు ఆమె స‌స్పెన్ష‌న్‌లో ఉన్నా ఆమె లైఫ్‌స్టైల్ చాలా ల‌గ్జ‌రీగా కొన‌సాగుతోంద‌ని దేవాదాయశాఖా వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి.


ప్రస్తుతం శాంతిపై అన్ని అభియోగాలు నిర్ధారణ కావడంతో, ఉద్యోగం నుంచి తొలగించాలనే నిర్ణయం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకప్పుడు కీలక అధికారిగా వ్యవహరించిన శాంతి ఇప్పుడు అవినీతి, వ్యక్తిగత వివాదాల ముద్రతో ఉద్యోగం కోల్పోవడం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: