
ఎన్నికల సమయంలో వైసీపీ తరచూ చేసిన విమర్శలు, ఆ పార్టీ కుప్పంలో పాగా వేయాలన్న వ్యూహాలకు చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి బలమైన సమాధానం ఇచ్చారు. ఎన్నికల ముందు భువనేశ్వరి పర్యటనల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చూపేందుకు హామీ ఇవ్వడం, ఎన్నికల తరువాత చంద్రబాబు స్వయంగా కీలక పథకాలను ప్రారంభించడం గణనీయమైన మార్పుకు దారితీసింది. ముఖ్యంగా సూర్యఘర్ పథకం ద్వారా కుప్పం ప్రజలకు విద్యుత్ ఖర్చుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో, ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చేతివృత్తులను ప్రోత్సహించడం, మహిళలకు కుట్టు యంత్రాలు, యువతకు కంప్యూటర్లు రుణాలపై అందించడం ద్వారా ఇంటికో ఆదాయ వనరు సృష్టిస్తున్నారు.
విద్యా ప్రోత్సాహక చర్యలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా కుప్పంలో రెండు ప్రధాన పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం స్థానికులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఈ రెండు పరిశ్రమల కోసం సుమారు 8 వేల కోట్ల పెట్టుబడులు రానుండగా, దాదాపు 5 వేల మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యేకంగా పండ్ల గుజ్జు (పల్ప్) పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యలు ఇకపై తగ్గే అవకాశం ఉంది. పంటకు తగిన ప్రాసెసింగ్ సదుపాయాలు లభించడం ద్వారా రైతులు లాభపడతారని అంచనా. ఈ పరిశ్రమలు ఏర్పడితే కుప్పం మాత్రమే కాకుండా మొత్తం జిల్లా కేంద్రంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
అభివృద్ధి పరంగా రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి. కుప్పానికి ఇప్పటికే నీరు అందించడంతో స్థానిక ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమగ్ర అభివృద్ధి చర్యలు కుప్పాన్ని ఏపీలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టే మార్గంలో ఉన్నాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.