జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు అధికారికంగా ఎమ్మెల్సీగా పెద్దల సభలోకి అడుగుపెట్టారు. మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన కోటాలో గెలిచి, ఇప్పుడు వర్షాకాల సమావేశాల ద్వారా తొలిసారి సభా వాతావరణాన్ని ఆస్వాదించారు. సభలోకి అడుగుపెట్టే ముందు తన సోదరుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలవడం విశేషం. తరువాత వెనక వరుసలో కూటమి సభ్యులతో కలిసి కూర్చున్న నాగబాబును పలువురు ఎమ్మెల్సీలు, నేతలు అభినందించారు. తొలి రోజు నుంచే నాగబాబు తన ప్రత్యేక స్టైల్‌లోనే కనిపించారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ అంశంపై చర్చ సాగుతోంది అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు గమనించవచ్చు. ఆయన కేవలం ఎమ్మెల్సీ మాత్రమే కాదు, జనసేనలో కీలక నాయకుడు కూడా కావడంతో, రాబోయే రోజుల్లో సభలో తన వాణిని గట్టిగా వినిపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


నిజానికి నాగబాబుకు ఎమ్మెల్సీ కంటే ముందే మంత్రి పదవి రిజర్వ్ అయిందనే ప్రచారం బలంగా సాగింది. ఏడాది క్రితం చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేస్తూ నాగబాబు మంత్రిగా అవుతారని సంకేతాలు ఇచ్చారు. అప్పట్లో ఏ మంత్రిత్వ శాఖ ఆయనకు దక్కబోతుందన్న చర్చ సోషల్ మీడియాలో రోజూ హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా మాత్రమే పెద్దల సభలోకి వచ్చారు. దీని వెనుక పవన్ కల్యాణ్ వ్యూహమే ఉందని అంటున్నారు.తాజాగా పవన్ మాట్లాడుతూ, “నాగబాబు భవిష్యత్తు నా చేతిలోనే ఉంది” అని క్లారిటీ ఇచ్చారు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు. పవన్ మదిలో ఉన్న అసలు ఆలోచన – నాగబాబును ఏపీ మంత్రిగా కాకుండా రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రిగా చేయాలని అంటున్నారు. 2026లో ఖాళీ కాబోయే 5 రాజ్యసభ సీట్లలో ఒకటి జనసేనకు ఖాయం అని, అదే నాగబాబుకు దక్కే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.



నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో మెగా బ్రదర్స్ ముగ్గురూ చట్టసభల్లో అడుగుపెట్టిన అరుదైన రికార్డు సృష్టించారు. చిరంజీవి 2009లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ 2024లో పిఠాపురం నుంచి గెలిచి ఎమ్మెల్యే కావడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా పెద్దల సభలోకి రావడంతో ముగ్గురు అన్నదమ్ములు ప్రజా ప్రతినిధులుగా ఉండటం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ సెన్సేషన్‌గా మారింది. మొత్తంగా చూస్తే, నాగబాబు తొలి అడుగులు సింపుల్‌గా ఉన్నా, ఆయన భవిష్యత్తు అడుగులు మాత్రం పవన్ కల్యాణ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: