ఆంధ్రప్రదేశ్‌లో మరో గొప్ప అధ్యాయం మొదలుకానుంది. కర్నూలు జిల్లాలోని జోన్నగిరి ప్రాంతంలో త్వరలోనే బంగారు తవ్వకాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదు … భారతదేశంలోనే మొదటి పెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ గా గుర్తింపు పొందిన దక్షిణ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ జరుగుతోంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం కనీసం 750 కిలోగ్రాముల బంగారు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో ఈ ఉత్పత్తి 950-1000 కిలోల వరకు పెరగవచ్చని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జోన్నగిరి ప్రాజెక్ట్ ఇప్పటికే పలు దశల్లో అనుమతులు పొందింది.
 

ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు అన్ని సాఫీగా పూర్తవడంతో, ఇప్పుడు తుది ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆధునిక మెషినరీ, ఎక్విప్‌మెంట్‌లపై సుమారు రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేశారు.పెద్ద ఎత్తున సాంకేతిక వనరులు ఉపయోగించడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా కలిగే అవకాశం ఉంది. భారతదేశం ప్రతి సంవత్సరం 800–1000 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతులు దేశ ఆర్థిక భారాన్ని మరింత పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో, జోన్నగిరి గోల్డ్ మైన్ ఉత్పత్తి ప్రారంభమైతే దేశీయ గోల్డ్ సరఫరాకు గణనీయమైన ఊతం లభిస్తుంది. దాంతో పాటు, బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా తగ్గించనుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద మేలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.



దక్షిణ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) ప్రత్యేకత ఏంటంటే… ఇది బీఎస్ఈలో లిస్టెడ్ అయిన ఏకైక గోల్డ్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ. కేవలం భారతదేశంలోనే కాదు, కిర్గిజ్‌స్తాన్ లో కూడా ఈ కంపెనీ బంగారు తవ్వకాల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. అక్కడి ప్రాజెక్ట్ కూడా 2025 అక్టోబర్ నాటికి ఉత్పత్తి మొదలుపెట్టబోతోంది. జోన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశానికే గర్వకారణం కానుంది. ప్రైవేట్ సెక్టార్‌లో ఇంత పెద్ద స్థాయి ప్రాజెక్ట్ మొదలుకావడం అరుదైన విషయం. బంగారం అంటే భారతీయులకు ప్రత్యేకమైన ఆభరణం. అలాంటి బంగారం ఇప్పుడు మన రాష్ట్రంలోనే తవ్వబడబోతుందంటే… అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, మొత్తం దేశానికే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఇక చూడాలి… జోన్నగిరి నుంచి వెలువడే ఈ బంగారం, దేశ ఆర్థిక స్థితిగతులపై ఎంత ప్రభావం చూపుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: