తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఇప్పుడు తేనెతుట్టెను తలపిస్తోంది. ఒకవైపు హైకోర్టు నిర్ణయాలు, మరోవైపు సుప్రీంకోర్టు పిటిషన్లు – మొత్తం సీన్ పూర్ మాస్ పాలిటికల్ డ్రామాగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే పలు పంచాయతీ ప్రెసిడెంట్లు, స్థానిక ప్రజాప్రతినిధులు హైకోర్టు తలుపు తట్టారు. “ఇంకెంతకాలం ఆలస్యం? వెంటనే ఎన్నికలు జరపండి” అని వాదించారు. దీని పై సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు “సెప్టెంబర్ 30 లోపు నిర్ణయం తీసుకుని ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలి” అని స్పష్టంగా ఆదేశించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేసింది. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు వేచి చూడాలి” అనే స్టాండ్ తీసుకుంది. కానీ కోర్టు దానిని పక్కనపెట్టి ముందుగా ఎన్నికలు నిర్వహించమని ఆదేశించడంతో ప్రభుత్వం కూడా మానసికంగా రెడీ అయిపోయింది.
 

వెంటనే ఎన్నికల అధికారులు నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచే నామినేషన్ ప్రాసెస్ మొదలుకానుంది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరపాలని ప్లాన్ చేశారు - అందులో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. నవంబర్ 11 నాటికి మొత్తం ప్రాసెస్ ముగిసిపోవాలి! ఇదిలా ఉండగా, రిజర్వేషన్ అంశం మాత్రం ఇంకా తేలలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓపై విచారణ హైకోర్టులోనే పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలోనే వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించి కొత్త పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు లోపభూయిష్టంగా ఉందని, రిజర్వేషన్ అంశం తేలకుండానే ఎన్నికల ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదని వాదించారు.



 “ఇలా హడావుడిగా ఎన్నికలు పెడితే చాలామంది పోటీదారులు నష్టపోతారు” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. సెప్టెంబర్ 29న దాఖలైన ఈ పిటిషన్‌పై అక్టోబర్ 6న విచారణ జరపాలని ధర్మాసనం నిర్ణయించింది. అదే సమయంలో 8వ తేదీ నుంచే నామినేషన్ ప్రాసెస్ మొదలుకాబోతోంది. ఇక ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏమి నిర్ణయిస్తుందో అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ప్రభుత్వం వాదనలు, ఎన్నికల సంఘం సిద్దత, కోర్టు తీర్పులు - ఇవన్నీ కలిసిపోతే వచ్చే రోజుల్లో తెలంగాణలో పెద్ద రాజకీయ తుపాను తప్పదనిపిస్తోంది. ఒకవైపు కోర్ట్ ఆదేశాలు, మరోవైపు పిటిషన్ ముఠాలు… స్థానిక ఎన్నికల వ్యవహారం ఇప్పుడు “మాస్ ప్యాకేజ్”తో సుప్రీంకోర్టు సీన్‌లోకి ఎంటర్ అయ్యింది!

మరింత సమాచారం తెలుసుకోండి: