
రాహుల్ గాంధీ “ఓటర్ అధికార్ యాత్ర” కూడా ప్రభావం చూపుతోందని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఊహాగానాలు అంతా ఒకే దిశగా ఉన్నాయి - ఈసారి బీహార్ పల్లె, పట్టణాలన్నీ నితీష్ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారబోతున్నాయని. ఇక ఎన్డీయే ఓడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది మరో ఆసక్తికర అంశం. నితీష్ కుమార్ 2005 నుంచి 2025 దాకా దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల సారథిగా ఉన్నారు. అలాంటి నితీష్ మాజీ సీఎంగా మారితే జేడీయూ పార్టీ భవిష్యత్తు ఏమవుతుంది? కేంద్రంలో ఉన్న జేడీయూ ఎంపీలు (12 మంది) ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తారా? లేక మార్గం మళ్లిస్తారా? అన్నది పెద్ద ప్రశ్న. కొంతమంది నితీష్ డిల్లీలో స్థానం పొందే అవకాశం ఉందని, ఆయన ఉప ప్రధాని పదవిని కూడా డిమాండ్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ప్రస్తుతం రెండు కీలక మిత్రపక్షాలతో - ఏపీ నుంచి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ, బీహార్ నుంచి నితీష్ కుమార్ జేడీయూ - మద్దతుతో నడుస్తోంది. ఈ రెండు పార్టీలకే కలిపి 28 మంది ఎంపీలు ఉన్నారు. నితీష్ ప్రభుత్వం బీహార్‌లో ఓడితే, జేడీయూ వైఖరి మారుతుందనే గుసగుసలు జాతీయ స్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీలో మాత్రం టీడీపీ, జనసేన బలమైన మిత్రపక్షాలుగా ఎన్డీయేతో కొనసాగుతాయని, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్ల కూటమి స్థిరంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద ఈసారి బీహార్ ఎన్నికలు కేవలం రాష్ట్రస్థాయిలో కాకుండా, జాతీయ రాజకీయాల దిశను కూడా ప్రభావితం చేయబోతున్నాయి. నితీష్ గెలిస్తే ఎన్డీయే బలం మరింత పెరుగుతుంది. ఓడితే మాత్రం కేంద్రంలోని బీజేపీ లెక్కల్లో తేడాలు రావచ్చు. నవంబర్‌లో జరిగే బీహార్ ఎన్నికల ఫలితాలే దేశ రాజకీయాల్లో తదుపరి అధ్యాయాన్ని రాయబోతున్నాయి.