హైద‌రాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి రాజకీయంగా హాట్‌స్పాట్‌గా మారింది. ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను వేగంగా అమలు చేస్తూ, అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తున్నాయి. ఈ నెల 13 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. ఈ పరిణామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. బుధవారం రాత్రి ఆలస్యంగా పార్టీ నాయకత్వం బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎంపిక చేసింది.


నవీన్ యాదవ్ రాజకీయ జీవితం 2014లో ప్రారంభమైంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన ఎంఐఎంలో చేరి, అదే సంవత్సరం జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచినా, గెలుపు గుర్రం ఎక్క‌లేక‌పోయారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. 2018లో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా, అప్పుడు కేవలం 7,000 ఓట్లు మాత్రమే దక్కించుకుని డిపాజిట్ కూడా కోల్పోయారు. త‌ర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ లో చేరి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2023 ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కలేదు. అయితే, పార్టీపై విశ్వాసం కోల్పోకుండా పనిచేస్తూ, ఈసారి చివరికి కాంగ్రెస్ అధినేతలు ఆయనకు అవకాశం కల్పించారు. ఆర్థికంగా బలమైన నాయకుడిగా, స్థానికంగా యువతలో కొంత ప్రాచుర్యం కలిగిన నేతగా పేరు తెచ్చుకున్నారు.


అయితే, నవీన్ యాదవ్‌కు గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ప్రజల్లో పట్టు అంతగా లేకపోవడం, గత రెండు సార్లు ఓటమిపాలు కావడం ఆయనకు ప్రధాన సవాలు. అంతేకాకుండా, జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉండడం న‌వీన్‌కు అంత సులువు కాదు. అయినా అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం ఆయనకు పెద్ద అదృష్టం. ఇక ప్రస్తుత ఎన్నికల్లో యువత, బీసీ వర్గం ఓటు బ్యాంకును ఆకర్షించగలిగితేనే ఆయన గెలుపు సాధ్యమని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన వెనుక నిలబడి, వ్యూహాత్మక ప్రచారానికి సిద్ధమవుతోంది. మొత్తంగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ పోటీ రాజకీయంగా ఆసక్తికర మలుపు తిప్పే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: