
“నాకు ఏ బాధైనా పుస్తకాలే ప్రియమిత్రాలు. అవే నా ప్రపంచం… వాటితోనే మాట్లాడతా. అందుకే నా గది పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది” అని పవన్ చెప్పగానే సభికులు కాసేపు ఆశ్చర్యపోయి చివరికి చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. పవన్ మాటల్లోని ఆ పుస్తక ప్రేమ అందరినీ స్పృశించింది. తాను చిన్నప్పటి నుంచి పుస్తక ప్రియుడినని చెప్పిన పవన్ కళ్యాణ్ - ఇప్పటి వరకు 2 వేల పుస్తకాలకు పైగా సేకరించి చదివినట్లు తెలిపారు. “పుస్తకాలు మనకు కేవలం అక్షరాలు కాదు… అవి జీవన పాఠాలు. మనం ఎంత మందిని స్నేహితులుగా చేసుకున్నా, మన నిజమైన స్నేహితుడు విజ్ఞానాన్ని పంచే పుస్తకమే” అని పవన్ స్పష్టం చేశారు.
డిజిటల్ యుగంలో పుస్తక పఠనం తగ్గిపోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకప్పుడు పురుష రచయితలతో సమానంగా మహిళా రచయితలు కూడా వెలుగొందారు. కానీ ఇప్పుడు రాసేవాళ్లు తగ్గిపోయారు, చదివేవాళ్లు కనిపించడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం” అని పవన్ అన్నారు. పుస్తక పఠనం మానసిక పరిపక్వతను పెంచే ‘దివ్య ఔషధం’ అని ఆయన పేర్కొన్నారు. “రోజుకు అరగంటైనా పుస్తకాలతో గడపడం అలవాటు చేసుకుంటే జీవిత దృష్టికోణమే మారిపోతుంది. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నా… నేను ఆ అరగంట సమయం పుస్తకాలకు కేటాయిస్తాను. ఎందుకంటే వాటితో గడిపే సమయం నాకు శాంతి ఇస్తుంది, కొత్త ఆలోచనల్ని అందిస్తుంది” అని పవన్ పంచుకున్నారు.
నేటి తరం యువత పుస్తకాలను స్నేహితులుగా చేసుకుంటే… వారు ఏ రంగంలోనైనా దూసుకెళ్తారని ఆయన సందేశం ఇచ్చారు. “మనం కోరుకుంటే ప్రపంచాన్ని మార్చగలం. ఆ మార్పు పుస్తకాలతోనే మొదలవుతుంది” అని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారు. ఇలాంటి మాటలతో పవన్ మరోసారి తన ఆలోచనా లోతును చూపించి, యువతలో పుస్తక పఠనంపై కొత్త ఉత్సాహాన్ని నింపారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా… విజ్ఞానాన్ని పంచే పుస్తకాలతో స్నేహం చెయ్యడం ఆయనకు ప్రత్యేకత. ఇదే ఆయనను అభిమానుల హృదయాల్లో ‘లీడర్’గా నిలబెడుతోంది.