బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలాన్ని అంచనా వేసుకుంటూ, అభ్యర్థుల ఎంపిక, కూటముల బలం, ప్రజల మద్దతు వంటి అంశాలపై తీవ్రంగా దృష్టి సారిస్తున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిపిన పలు సర్వేలు ఎన్నికల హీట్‌ను మరింత పెంచేశాయి.కొన్ని సర్వేలు ఇండియా కూటమి  ఈసారి అధికారం చేపట్టబోతోందని సూచిస్తుండగా, మరికొన్ని సర్వేలు మాత్రం ఎన్డీఏ  కూటమి మరోసారి అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పుతున్నాయి. ఈ అంచనాల మధ్యలో, బీహార్ రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది.


ప్రతిపక్ష ఆర్జేడీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామ చేశారు.  నవాడ నియోజకవర్గానికి చెందిన విభదేవి, రాజోలి ఎమ్మెల్యే ప్రకాశ్ వీర్ — ఆదివారం నాడు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత రాజీనామాలు సమర్పించడమే కాకుండా, వీరిద్దరూ స్పీకర్ కిషోర్ యాదవ్‌ను ప్రత్యేకంగా కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. వీరి రాజీనామాలను స్పీకర్ వెంటనే ఆమోదించారని అసెంబ్లీ వర్గాలు ధృవీకరించాయి. దీంతో బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది — ఈ ఇద్దరు నేతలు త్వరలోనే వేరే పార్టీలో చేరబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. విభదేవి భర్త, మాజీ ఎమ్మెల్యే రాజు యాదవ్ పొక్సో కేసుల కారణంగా జైల్లో గడిపి ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో తమ కుటుంబానికి పార్టీ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో ఆయన కుటుంబం ఆర్జేడీ నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.



ఇప్పుడు అదే అసంతృప్తి విభదేవి రాజీనామాకు దారితీసిందని చెబుతున్నారు. పార్టీ మార్పు చేస్తే స్థానిక రాజకీయ సమీకరణాలపై దాని ప్రభావం ఎంతుంటుందోనని పార్టీ హైకమాండ్ ఆందోళన చెందుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ వీర్ ఈసారి పార్టీ టికెట్ లభించకపోవచ్చన్న భయంతో ముందుగానే రాజీనామా చేయడం రాజకీయంగా పెద్ద మలుపుగా భావిస్తున్నారు. ఆయన తదుపరి అడుగు ఏంటన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ప్రకారం, పోలింగ్ నవంబర్ 6 మరియు 11 తేదీల్లో జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలూ బలమైన ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ, ఇండియా కూటమి, ఎల్‌జేపీ వంటి పార్టీలు తమ మేనిఫెస్టోలు విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించాయి.



ఇప్పుడు బీహార్ రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. ఎవరు ఏ కూటమిలో చేరతారు? ఎవరు తిరుగుబాటు చేస్తారు? అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి.ఒక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరో వైపు తేజస్వీ యాదవ్ మధ్య నేరుగా పోరు జరగబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రాజీనామాలు, సర్వే ఫలితాలు, అంతర్గత అసంతృప్తులు — అన్నీ కలిపి బీహార్ ఎన్నికలను ఈసారి “నెవర్ బిఫోర్ – ఎవర్ ఆఫ్టర్” అనిపించేలా మలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: