
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు హీరోయిన్ల రీఎంట్రీలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు వెండితెరను ఏలిన పలువురు కథానాయికలు పెళ్లి, కుటుంబ బాధ్యతల కారణంగా కొంత విరామం తీసుకుని మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే కొంతమంది రీఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
అన్షు, లయ, జెనీలియా వంటి కొందరు హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చినా, వారిలో మెజారిటీ హీరోయిన్లకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదనే చెప్పాలి. 'మన్మథుడు' బ్యూటీ అన్షు 'మజాకా' సినిమాతో, తెలుగమ్మాయి లయ నితిన్ 'తమ్ముడు' చిత్రంలో హీరోకు అక్క పాత్రలో, స్టార్ హీరోయిన్ జెనీలియా 'జూనియర్' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో వారి సెకండ్ ఇన్నింగ్స్‌కి నిరాశే ఎదురైంది.
ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ చేరనున్నారు. ఆమె కిరణ్ అబ్బవరం నటిస్తున్న 'కే-ర్యాంప్' సినిమాతో వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. గోపీచంద్‌తో 'రణం', అల్లరి నరేష్‌తో చేసిన 'బెండు అప్పారావు RMP' వంటి సినిమాల ద్వారా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె 'కే-ర్యాంప్' చిత్రంలో ఓ కీలక పాత్ర ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. అంతకుముందు ఒక వెబ్ సిరీస్‌లో కూడా నటించారు.
'కే-ర్యాంప్' చిత్రం హిట్టైతే కామ్నా జెఠ్మలానీకి సెకండ్ ఇన్నింగ్స్‌లో తిరుగుండదని చెప్పవచ్చు. మరి ఈ 'రణం' బ్యూటీకి అయినా రీఎంట్రీ సక్సెస్ అవుతుందా, ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ కావడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కామ్నా జెఠ్మలానీ రీఎంట్రీకి ప్రేక్షకులు ఎలాంటి స్వాగతం పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు