ఒక్కొక్క ఎమ్మెల్యే స్ట‌యిల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలానే.. గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన గ‌ళ్లా మాధ‌వి  వ్య‌వ‌హారం కూడా ఆస‌క్తిగా మారింది. పొద్దు పొద్దున్నే ఆమె బైకుపై నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డం, పారిశుద్ధ్యంపై ప్ర‌జ‌ల కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు.. తాను ప‌ర్య‌టిస్తున్న ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ల‌ను కూడా ఆమె సంద‌ర్శిస్తున్నారు. మ‌ధ్యాహ్న భోజ‌నం రుచి చూస్తున్నారు.


త‌ద్వారా చిన్నారుల‌కు అందుతున్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని స‌క్ర‌మంగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుం టున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో తాజాగా మహిళా గ్రీవెన్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో గుంటూరులో మాధవి మరొక ముందడుగు వేసిన‌ట్టు అయింద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఎమ్మెల్యే అయిన‌.. అన‌తి కాలంలోనే ఆమె మహిళల  నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. మహిళల సమస్యలను ప్రత్యేకంగా గ్రీవెన్స్ ద్వారా పరిష్కరిస్తున్న ఎంఎల్ఏ గా కూడా పేరు తెచ్చుకున్నారు.


గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇది ఒక మైలు రాయిగా చెప్పవచ్చున‌ని టీడీపీ నాయ‌కులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం పట్ల నియోజకవర్గ ప్రజలు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్ర‌జ‌ల‌ను, ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను  కూడా అందుబాటులో ఉంచుకుంటూ ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యేగా మాధవి గుర్తింపు పొందారు. త‌న కంటూ జిల్లాలో ఒక ప్రత్యేక ముద్ర‌ను వేసుకుంటున్నారు.


ఏం చేస్తున్నారు..?
ఇప్ప‌టి వ‌రకు గ్రీవెన్స్ అంటే.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డం.. వాటిని సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే. అయితే.. మాధ‌వి ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల కోసం గ్రీవెన్స్ నిర్వ‌హిస్తున్నారు. దీనిలో మ‌హిళ‌ల ఆరోగ్యానికి సంబంధించిన స‌మ‌స్య‌లు, కుటుంబ క‌ల‌హాలు, విద్య‌, చేతి వృత్తులు, వేధింపులు.. మ‌హిళా సాధికార‌త‌కు సంబంధించిన అంశాల‌పై ఆమె అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌పై ఎవ‌రు వ‌చ్చినా.. వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నారు. ఇలా.. రాష్ట్రంలో కేవ‌లం మ‌హిళ కోసం గ్రీవెన్స్ నిర్వ‌హిస్తున్న ఏకైక‌ ఎమ్మెల్యేగా మాధ‌విగుర్తింపు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: