 
                                
                                
                                
                            
                        
                        సాధారణంగా రాజకీయ నాయకులు తమ సొంత పార్టీ నేతలపై బహిరంగంగా విమర్శలు చేయడానికి ఇష్టపడరు. కానీ, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీలో కలకలం సృష్టిస్తున్నారు. కొలికపూడి వ్యవహార శైలి ఇప్పుడు అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారింది.
ఈ ఇద్దరు నేతల మధ్య పోరు తీవ్రరూపం దాల్చడానికి వెనుక అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి ఎంపీ కేశినేని చిన్ని ఏకంగా రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. దీనికి సంబంధించి తన వాట్సాప్ స్టేటస్‌లో బ్యాంక్ లావాదేవీల వివరాలను సైతం పోస్ట్ చేసి షాకిచ్చారు. టికెట్ కోసం డబ్బులు ఇచ్చినట్లు ఆయన చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై ఎంపీ కేశినేని చిన్ని కూడా ఘాటుగా స్పందించారు. "నిన్నటి వరకు నన్ను దేవుడు అన్న వ్యక్తికి ఇప్పుడు దెయ్యంలా కనిపిస్తున్నానా?" అని ప్రశ్నించారు. చంద్రబాబును అవమానించిన వారికి పదవులు ఎలా ఇస్తామని కౌంటర్ ఇచ్చారు.
వాస్తవానికి, కొలికపూడి ఎమ్మెల్యేగా గెలవడం కొంతమంది టీడీపీ నేతలకే ఇష్టం లేదని సమాచారం. ఇద్దరు నేతల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇటీవల కొలికపూడి ఇంటి వెనుక జరిగిన ఒక కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం అందలేదని, దీనివల్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. ఇవన్నీ కొలికపూడి, కేశినేని చిన్నిపై ఆరోపణలు చేయడానికి కారణాలుగా చెబుతున్నారు.
మరోవైపు, ఈ వివాదంలో కూటమి మద్దతు మాత్రం ఎంపీ కేశినేని చిన్నికే ఉన్నట్లు సమాచారం అందుతోంది. కూటమి నేతలు సమావేశమై కేశినేనికే అండగా నిలవాలని నిర్ణయించుకోవడం కొలికపూడికి మరింత షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఇద్దరు నేతల వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని గట్టి హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. అయితే కొలికపూడి మాత్రం తన శైలిని మార్చుకోకపోవడం టీడీపీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. ఈ అంతర్గత పోరు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి