దేశ రాజకీయాల్లో పతాక స్థాయి ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది అంకానికి చేరుకుంది! అధికార ఎన్డీఏ (NDA) కూటమి అభ్యర్థులు తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. దాదాపు 174 స్థానాల్లో స్పష్టమైన ముందంజలో ఉన్న ఎన్డీఏ.. మరోసారి బిహార్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ విజయోత్సాహంతో ఊగిపోయిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్నాయి! తదుపరి లక్ష్యం పశ్చిమ బెంగాల్! .. బిహార్‌లోని బెగుసరాయ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్ సింగ్.. తమ విజయం పట్ల పూర్తి ధీమా వ్యక్తం చేయడమే కాదు.. తమ పార్టీ తదుపరి రాజకీయ లక్ష్యాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు!
 

"భాజపా కార్యకర్తగా చెబుతున్నా.. బిహార్‌లో ఎన్డీయే విజయం ఖాయం. ఇక మా తదుపరి లక్ష్యం పశ్చిమ బెంగాలే!" అంటూ ఆయన అగ్గి రాజేశారు. బెంగాల్‌లో ప్రస్తుతం ఉన్నది "అరాచక ప్రభుత్వం" అని ఘాటుగా విమర్శించిన ఆయన.. అక్కడ జరగబోయే ఎన్నికల్లో కూడా తమదే గెలుపు అని ధీమాగా ప్రకటించారు. బిహార్ ప్రజలు అభివృద్ధి అజెండాకే పట్టం కట్టారని, అన్యాయాన్ని, అరాచకాన్ని వద్దనుకున్నారని ఈ ఫలితాలు చూస్తే అర్థమవుతోందని విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతిపరులకు అధికారం అప్పగించరు! .. గిరిరాజ్ సింగ్ ప్రతిపక్ష కూటమి అయిన మహాగఠ్‌బంధన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. "బిహార్‌ను అర్థం చేసుకున్న వారికి తెలుసు.

 

రాష్ట్ర ప్రజలు అరాచకాన్ని, అవినీతిని కోరుకోరని. అవినీతిపరులైన నాయకులకు ఇక్కడి ప్రజలు అధికారాన్ని అప్పగించాలనుకోవడం లేదు" అంటూ తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. బిహార్ ఎప్పటికీ అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. అంతర్గత అనుమానాలకు చెక్ పెడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై కూడా గిరిరాజ్ సింగ్ స్పష్టతనిచ్చారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఎలాంటి గందరగోళం లేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్‌ కుమారే కాబోయే సీఎం అంటూ ప్రకటించి, కూటమిలోని అన్ని వర్గాలకు గట్టి సందేశాన్ని పంపారు. మొత్తానికి బిహార్ విజయం, బెంగాల్‌ లక్ష్య ప్రకటనతో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన గిరిరాజ్ సింగ్.. జాతీయ రాజకీయాల్లో మరో పెద్ద యుద్ధానికి తెర లేపినట్లే!

మరింత సమాచారం తెలుసుకోండి: