దిగ్గజ మీడియా సంస్థల వ్యవస్థాపకులు, తెలుగు జాతి గర్వించదగ్గ మహా పురుషుడు, కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారి పేరు మీద స్థాపించిన 'రామోజీ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డుల' తొలి ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన అతిరథ మహారథులు అంతా ఒకే వేదికపై చేరి, తెలుగు మీడియా దిగ్గజానికి అపురూపమైన నివాళి అర్పించారు. రామోజీరావు: ఒక శక్తి, ఒక సంచలనం! .. రామోజీరావు ... ఈ పేరు కేవలం ఒక వ్యక్తిది కాదు, ఒక శక్తికి, ఒక నిబద్ధతకు, ధృడ సంకల్పానికి నిలువెత్తు రూపం. దశాబ్దాల పాటు పత్రికారంగాన్ని ప్రభావితం చేస్తూ, ఏ అధికార పదవులూ ఆశించకుండా కేవలం అక్షరాల ద్వారానే సమాజానికి మేలు చేసిన చరిత్ర ఆయనది. సామాన్య ప్రజలను సైతం అసమాన్యులుగా తీర్చిదిద్దిన అపారమైన దూరదృష్టి, సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయవచ్చో ఆచరణలో చూపిన అసాధారణ ధైర్యం ఆయన సొంతం.
 

అందుకే ఆయన జీవితం ఒక సంచలనంగా, స్ఫూర్తిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకుంది. బాబు మనసులో మాట: 'పది మంది రామోజీలుంటే సమాజమే మారుతుంది! ..ఈ సందర్భంగా వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగం సభకే హైలైట్‌గా నిలిచింది. తన గురువు, తన ఆదర్శప్రాయుడు అయిన రామోజీరావు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడిన ప్రతి మాటా సభికుల హృదయాలను తాకింది. "రామోజీరావు లాంటి మహానేతలు మరో పది మంది ఉంటే చాలు... ఈ సమాజాన్ని పూర్తిగా మార్చేయవచ్చు!" అంటూ బాబు చెప్పిన మాటలు, రామోజీ గారి వ్యక్తిత్వానికి దక్కిన అత్యున్నత గౌరవంగా నిలిచాయి. పోరాట యోధుడు, దార్శనికుడు! .. రామోజీరావు గారిని బాబు 'పోరాట యోధుడిగా' అభివర్ణించారు. "రాబోయే యాభై ఏళ్ల గురించి ముందే ఆలోచించి, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేసిన గొప్ప దార్శనికుడు ఆయన.



 బలమైన ప్రభుత్వాలతో సైతం వెరవకుండా పోరాడి విజయం సాధించిన ధీశాలి రామోజీ" అని బాబు గంభీరంగా ప్రకటించారు. తన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు రామోజీరావు గారిని తలచుకుంటే చాలు, తనకు ధైర్యం రెట్టింపు అవుతుందని బాబు వ్యక్తం చేసిన భావోద్వేగం, వారిద్దరి మధ్య ఉన్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని కళ్ళకు కట్టింది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా వెళ్లగలిగిన రాజీలేని మనస్తత్వం, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నిలబడిన దృఢ విశ్వాసం ఆయన సొంతమని బాబు కొనియాడారు. కేవలం మీడియా దిగ్గజమే కాదు, వ్యవస్థాపక పితామహుడిగా, దార్శనికుడిగా రామోజీరావు గారి కీర్తి ప్రతిష్టలు ఎల్లప్పుడూ వెలుగొందుతాయని ఈ అవార్డుల ప్రదానోత్సవం చాటి చెప్పింది. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: