శంకర భగవానుని పన్నెండు జ్యోతిర్లింగాలలో శ్రీకేదారనాథ జ్యోతిర్లింగం , హిమాచ్ఛాదిత ప్రదేశంలో గల ఒక దివ్య జ్యోతిర్లింగం. హిమాలయదేవ భూమిలో ఉన్న తీర్థస్థానపు దర్శనం కేవలం ఆరు నెలలపాటు మాత్రమే సాధ్యం. వైశాఖ మాసం నుండి ఆశ్వీయుజం వరకూ ఈ జ్యోతిర్లింగ యాత్ర ప్రజలు చేయగలరు. సంవత్సరంలో మిగతాకాలం అంతా ఎముకలుకొరికే చలితో, హిమాలయ పర్వత ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉన్నందువల్ల శ్రీ కేదారనాథ ఆలయం మూసివేయబడి ఉంటుంది.
కార్తీక మాసంలో చాలా మంచుకురిసినప్పుడు ఆలయంలో నేతితో నందాదీపాన్ని వెలిగించి, శ్రీకేదారేశ్వుని భోగ సింహాసనం బైటికి తెస్తారు. అన్ని ద్వాలనూ అప్పుడు మూసివేస్తారు. కార్తీక మాసం నుంచి, చైత్రమాసం వరకూ శ్రీ కేదారేశ్వరుని నివాసం దిగువగల ఉర్వీమఠంలో ఉంటుంది. వైశాఖమాసంలో మంచుకరగటం ప్రారంభం కాగానే ఆలయ ద్వారాలు తెరవబడతాయి. ఇలా ఆరు నెలల తరువాత ఆలయ ద్వారాలు తెరచినప్పుడు కార్తీక మాసంలో వెలిగించిన సందాదీపం ఇంకా అలాగే వెలుగుతూ ఉంటుంది. ఈ దివ్య జ్యోతి దర్శనం చేసుకుని భక్తులు ధన్యులయమయ్యామని భావిస్తారు.
హరిద్వార్ లేదా హర్ ద్వార్ మోక్షదాయినీ మాయాపురి అని భావించబడుతోంది. ఈ హరిద్వారం దాటి ఋషికేశ్, దేవ ప్రయాగ, సోన్ ప్రయాగ, త్రియుగీ నారాయణ్, గౌరీ కుండ్ దాటి కేదార్ నాథ్ చేరాలి, కొంత ప్రయాణం మోటారు వాహనాలపై, కొంత కాలినడకనా వెళ్లాల్సి ఉంటుంది. హిమాలయాలలోని ఈ దారి అతి దుర్గమం మరియు ప్రమాద భరితంగానూ ఉంటుంది. కానీ అచంచలమైన శ్రద్ధాళువులు ఈ కఠినతర యాత్రను ఎలాగో చేయగలుగుతారు. శ్రద్ధాబలంతో ఈ విధంగా సకల కష్టాలనూ దాటవచ్చూ.
ఎక్కేటప్పుడు కొందరు గుర్రాలపైనా, టోకల్ అంటే కావిడి బుట్టలలోనూ కూర్చునో, లేక చేతికర్ర సాయంతో నడిచో లేక ఢోలీలోనో కూర్చుని వెడతారు. ఇటువంటి ఏర్పాట్లు ఇక్కడ లభిస్తాయి. విశ్రమించటానికై మధ్యమధ్యన ధర్మశాలలూ, మఠాలు, ఆశ్రమాలూ ఉన్నాయి. యాత్రీకులు గౌరీకుండ్ చేరగానే అక్కడగల వేడినీటి కుండంలో స్నానం చేసుకుని, అక్కడగల మస్తక విహీన గణపతిని సందర్శించుకుంటారు. ఈ గౌరీకుండంలో గల గణపతి తలను శంకరుడు త్రిశూలంతో నరికివేశాడు. తరువాత అతనికి గజముఖం అమర్చి పునర్జీవితుడిని చేశాడు.
గౌరీకుండ్ నుంచి రెండు-మూడు క్రోసుల దూరంలో ఎత్తైన హిమాలయాల పరిసరాలలో మందాకినీ నది ఘాట్ లో శంకరుని దివ్య జ్యోతిర్లింగం, కేందార్ నాథ్ ఆలయం అగుపిస్తాయి. ఇక్కడ శంకరుని లింగంకానీ, విగ్రహం కానీ ఏమీలేవు. కేవలం ఒక త్రిభుజాకారపు ఎత్తైన స్థానం ఒకటుంది. ఇది మహేశుని (దున్నపోతు) యొక్క వెనుకభాగం అని అంటారు. ఈ జ్యోతిర్లింగపు ఆకారం ఇలా ఎందుకుందో దాని గురించి ఒక అద్భుతమైన కథ ఉంది:—
కౌరవులు, పాండవులు యుద్ధం చసినపుడు వారి బంధుగణం నుండి ఎంతో మంది హతులయ్యారు. పాపప్రక్షాళనకై పాండవులు తీర్థస్థానం అయిన కాశీ చేరుకున్నారు. కానీ విశ్వేశ్వరుడు ఆసమయంలో హిమాలయాలలోని కైలాసానికి వెళ్లినట్లు సమాచారం అందింది. పాండవులు కాశీ నుంచి హరిద్వారం గండా హిమాలయా లోయలకు చేరుకున్నారు. దూరం నుండి శంకరుని దర్శనం చేసుకున్నారు. కానీ పాండవులను చూసి శివుడు అంతర్థానం అయ్యాడు. ఇది చూసి ధర్మరాజు ఇలా అన్నాడు. "హే దేవా, మా పాపిష్టి ముఖాలను చూసి మాయం అయ్యావా సరే, మేం మీ కోరకై వెతుకుతాం. మీ దర్శనం అయితేగానీ మా పాపాలు పోవు. మీరు ఎక్క అంతర్థానం అయ్యారో ఆస్థానం 'గుప్తకాశీ' పేరుతో పవిత్రస్థానం అవుతుంది" అన్నాడు.
"గుప్తకాశీ" (రుద్రపయాగ) నుండి పాండవులు బయలుదేరి హిమాలయాల వైపు కైలాసం దిశగా వెడుతూ గౌరీకుండంలో తిరుగాడసాగారు. శంకరునికై వెతకనారంభించారు. ఇంతలో నకుల -సహదేవులు ఒక దున్నపోతు (మహిషం)ను చూశారు. దాని అపురూప ఆకారాన్ని చూసి ధర్మరాజిలా అన్నాడు. " శంకర భగవానుడే ఈ మహిషావతారం ఎత్తాడు. మనల్ని పరీక్షిస్తున్నాడు." అంతే ఇంకేముంది? గదాధారి భీముడు ఆ మహిషం వెంటపడ్డాడు. మహిషం దూకి పారిపోసాగింది. చేతికందనేలేదు. భీముడు అలసిపోయాడు. అప్పుడు భీముడు తన గదతో మహిషాన్ని గాయపరిచాడు. అప్పుడా మహిషం నేలలో ఒక తొర్రిలో దూరి ముఖం దాచుకుని కూర్చుంది. భీముడు దానిని తోకపుచ్చుకుని లాగాసాగేడు. ఈ ఊపుకి మహిషపు ముఖం ఎగిరి నేపాలులో పడింది. మహిషపు పార్శ్వ భాగం కేదార ధామంలోనే ఉండి పోయింది. తలపడిన చోటైన నేపాలులో దీని పశుపతినాథ్ అనే పేరుతో పూజిస్తారు.
మహేశుని పార్శ్వ భాగం నుండి ఒక దివ్య జ్యోతి ప్రకటితమయ్యింది. అందునుండి మహాశివుడు ఉద్భవించాడు. పాండవులకు దర్శనమిచ్చాడు. ఆ విధంగా పాండవుల పాప ప్రక్షాళనం జరిగింది. శంకరుడు పాండవుల నుద్దేశించి ఇలా అన్నాడు. "నేనిక్కడ ఈ త్రిభుజాకారపు జ్యోతిర్లింగ రూపంలో ఎల్లప్పుడూ ఉండి పోతున్నాను. కేదారనాథ్ దర్శనంతో భక్తులు పావనం అవుతారు". కేదారనాథ్ పరిసరాలలో పాండవులకు సంబంధించిన గుర్తులు ఎన్నో ఉన్నాయి. పాండురాజు ఈ వనంలోనే మాద్రితో విహారానికి వచ్చి మరణించాడు. ఆ స్థానం పాండుకేశ్వర్ అనే పేరుతో ప్రసిద్ధి కెక్కింది. అక్కడి ఆదివాసులు పాండవ నృత్యం చేస్తారు. ఏ ఉన్నత పర్వత శిఖరం నుంచి పాండవులు స్వర్గవాసులు అయ్యారో దానిని " స్వర్గారోహిణి" అని పిలుస్తారు. ధర్మరాజు స్వర్గం చేరుకునే ముందు అతడి చేతివ్రేలు ఒకటి నేలపై పడింది. ఆ స్థానంలో ధర్మరాజు అంగుష్ఠం అంత శివలింగాన్ని స్థాపించాడు.
మహిషరూప ధారి అయిన శివునిపై భీముడు గదతో దాడి చేశాడు. అందవల్ల అతనికి ఎంతో పశ్చాత్తాపం కలిగింది. వెంటనే మహిషం యొక్క శరీరంపై నేతిని పూయసాగాడు. ఈ విషయానికి సంస్మరణగా నేటికీ జ్యోతిర్లింగ కేదారనాథునికి నేయి పూస్తారు. ఇక్కడ శంకరునికి పూజ ఇలాగే జరుగుతుంది. నీరు, బిల్వ పత్రంతో ఇక్కడ అభిషేకించరు. పూలు కూడా వేయరు.
నర-నారాయణులు బదరికా గ్రామం వెళ్లి పార్థివ పూజ చేస్తూ ఉండగా, అక్కడ పార్థివ శివుడు ప్రత్యక్షం అయ్యాడు. కొంత సమయానంతరం శివుడు ఏదయినా వరం కోరుకోమన్నాడు. అపుడు నర-నారాయణులు లోక కల్యాణార్థం, తమ స్వంతరూపంలో అక్కడే స్థిరపడి, పూజలందుకోమని ప్రార్థించారు. వారి ఈ కోరికను మన్నించి, హిమాశ్రిక కేదార నామం గల స్థానంలో సాక్షాత్తూ మహేశ్వరుడు వెలసి కేదారేశ్వర నామంతో ప్రసిద్ధికెక్కాడు.
కేదారేశ్వరుని దర్శనంతో కలలో కూడా దుఃఖం కలగదు. కేదారేశ్వరుని పూజతో పాండవుల దుఃఖోపశమనం కలిగింది. బద్రికేశ్వర పూజవల్ల భవబంధాల నుండి విముక్తి కలుగుతుంది. కేదారేశ్వరంలో దానం చేసినవారు నేరుగా శివునిలో ఐక్యం అయిపోతారు.
కేదార్ నాథ్ ముఖ్య ఆలయ పరిసరాల్లో అనేక పవిత్ర స్థానాలున్నాయి. ఆలయపు వెనుక ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది. దూరంగా ఉండే కొండల శిఖరంపై భృగుపతనం (భైరవ్ ఉడాన్) అనే పేరుగల భయంకరమైన లోయ ఉంది. అక్కడికి చేరుకోడానికి సాక్షాత్తూ మృత్యుముఖం నుండి వెళ్లవలసి ఉంటుంది. కానీ పట్టుదల, శ్రద్ధా, భక్తులు ఉంటే వెడుతున్నప్పుడు ఏమాత్రం అలసట ఉండదు. అందరినోటా ఒకటేమాట-"జయ్ కేదార్ నాథ్ ! జయ్ కేదార్ నాథ్ !".
శ్రీమత్ శంకరాచార్యులు ఇలా అన్నారు:-
హిమద్రి పార్శ్వేచ తటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోనగాధ్యైః
కేదారమీశం శివమేకమీడే
అనగా, హిమాలయ ప్రదేశంలో రమించేటువంటి వాడూ, ఋషులు, మునులు మరియు సురాసుర, యక్ష, మహానాగాదులచే నిరంతరం పూజించబడేవాడూ అయిన శ్రీ కేదారేశ్వర మహాదేవునికి కోటికోటి ప్రణామాలు.
పన్నెండవ జ్యోతిర్లింగం అయిన ఘృష్ణేశ్వరుని విశిష్టత, యాత్ర వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి