ప్రస్తుతంఏటిఎం కార్డులు ప్రజలు అధిక సంఖ్యలో వాడుతున్నారు. ఒక్కప్పుడు డబ్బులు కావాలంటే గంటల తరపడి క్యూలో బ్యాంకుల ముందు నిలపడాల్సి వచ్చేది . కానీ ఏటీఎంలు వచ్చాక ప్రతి ఒకరు అతి సులువుగా ఏటిఎం కేంద్రం వద్ద డ‌బ్బులు తీసుకుంటున్నారు. అయితే ఒకపక్క ఏటీఎంలలో భద్రత లోపాలు అనేకసార్లు బైటపడుతున్నప్పటికీ బ్యాంకులు తగు చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేప‌థ్యంలో ఏటీఎంలలో విండోస్‌ 7 సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం మొదలుకుని యాంటీ స్కిమ్మింగ్‌ కార్డ్‌ రీడర్లు ఇన్‌స్టాల్‌ చేయడం, నగదు సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల దాకా వివిధ అంశాలపై ఏప్రిల్‌ 2018 నుంచి ఆగస్టు 2019 మధ్యలో ఆర్‌బీఐ, హోంశాఖ పలు సర్క్యులర్‌లు జారీ చేశాయి. నగదు భర్తీ చేసే సంస్థలు పాటించాల్సిన నిబంధనలు కూడా వీటిల్లో ఉన్నాయి. 

 

విండోస్‌ 7 సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు ఆర్‌బీఐ విధించిన జనవరి 2020 డెడ్‌లైన్‌ దగ్గరపడుతోంది. అయిన‌ప్ప‌టికీ దీనిపై దృష్టి సారించ‌డం లేదు.  ఏటీఎంలలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి 2017 మార్చి, నవంబర్‌లలో చేసిన సిఫార్సులను అమలు చేయాలంటూ 2018 జూన్‌ 21న ఆర్‌బీఐ ఒక సర్క్యులర్‌ పంపించింది. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం..  ఏటీఎంలను కచ్చితంగా గోడలు లేదా పిల్లర్లలోకి అమర్చడం, నగదు భర్తీ కోసం వన్‌ టైమ్‌ కాంబినేషన్‌ (ఓటీసీ) తాళాలను ఉపయోగించడం తదితర నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్‌బీఐ ఆదేశాల అమలు పురోగతి నత్తనడకన సాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

 

ఇక ఏటీఎంలలో నగదు భర్తీకి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానానికి బదులుగా మరింత సురక్షితమైన లాకబుల్‌ క్యాసెట్స్‌ (పెట్టె) విధానాన్ని అమల్లోకి తేవాలని సూచిస్తూ 2018 ఏప్రిల్‌ 12న.. ఆర్‌బీఐ మరో సర్క్యులర్‌ కూడా ఇచ్చింది. ఇందులో 2020–21 నాటికి మొత్తం ఏటీఎంలలో కనీసం 60% ఏటీఎంలలో దీన్ని అమల్లోకి తేవాలని నిర్దేశించింది. అయితే దీనిపై బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఖర్చులు తడిసిమోపెడవుతాయని, పరిశ్రమపై సుమారు రూ. 6,000 కోట్ల భారం పడుతుందంటున్నాయి. భారీ ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నందున ఈ ఆదేశాల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖను కోరాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: