న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ప్రైవసీ పాలసీపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ గోప్యతా విధానాన్ని అంగీకరించాలా? వద్దా? అనే విషయంపై దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఇది స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, ఎవరూ బలవంతం చేయలేరని తేల్చి చెప్పింది. వాట్సాప్ నిబంధనలను అంగీకరించే వారు అందులోనే కొనసాగవచ్చని, లేని వారు బయటకు వచ్చేయవచ్చని సోమవారం స్పష్టం చేసింది. వాట్సాప్ అనేది ఓ ప్రైవేటు యాప్ అని, ఇష్టం లేకపోతే అందులో చేరవద్దని పిటిషనర్‌కు చెప్పిన జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ.. వాట్సాప్‌లో చేరాలా వద్దా? అనేది స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని, ఇష్టం లేకపోతే వాట్సాప్ నిబంధనలు అంగీకరించకుండా వేరే కొత్త యాప్‌ను ఉపయోగించు కోవాలని సూచించారు. వాట్సాప్ కొత్త పాలసీని సవాలు చేస్తూ ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఇలా స్పందించింది.  

చాలా వరకు మొబైల్ యాప్‌ల నియమ నిబంధనలు ఇలానే ఉంటాయని, వాటిని గనుక ఓసారి చదివితే ఇలాంటి షరతులకు అంగీకరించామా? అని మనమే ఆశ్చర్యపోతామని కోర్టు పేర్కొంది. చివరకు గూగుల్ మ్యాప్స్ కూడా మన డేటా మొత్తాన్ని సేకరించి స్టోర్ చేస్తుందని కోర్టు వెల్లడించింది. పిటిషనర్ వేసిన లాసూట్ ప్రకారం, ఎలాంటి డేటా లీక్ అవుతుందన్న విషయం అర్థం కాలేదని, సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, సమయాభావం కారణంగా అలా చేయడానికి ఇప్పుడు కుదరదని, ఈ నెల 25 న పరిశీలిద్దామని చెప్పింది. కేంద్రం కూడా ఇందుకు అంగీకరించింది. సమస్యను విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

వాట్సాప్, ఫేస్‌బుక్ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీలు మాట్లాడుతూ.. పిటిషన్‌లో పస లేదని, అందులోని చాలా అంశాలకు ఎటువంటి ఆధారాలు లేవని విమర్శలు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగే ప్రైవేటు చాట్ మెసేజ్‌లు మాత్రం ఎన్‌క్రిప్ట్‌గానే ఉంటాయని, వాట్సాప్ వాటిని స్టోర్ చేయదని కోర్టుకు వివరణ ఇచ్చారు. కొత్త పాలసీలోనూ ఈ నిబంధనలు  మారబోవన్నారు. కొత్త విధానం బిజినెస్ చాట్స్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: