
అయితే కమల్ హాసన్ పార్టీని పెద్దగా సీరియస్ గా పట్టించుకోకపోయినా.. చిన్న కర్రనైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఇటీవల తరచూ కమల్ హాసన్ పార్టీ నాయకులపై ఐటీ శాఖ వరుసగా దాడులు నిర్వహిస్తోంది. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు సన్నిహితుడు, తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం అభ్యర్థి లేరోన్ మొరాయ్సి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిపిన తనిఖీల్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకూ కమల్ పార్టీ ప్రముఖుల నుంచి రూ.22.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారట. రూ.80 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని గుర్తించినట్టు తెలుస్తోంది. ఎంఎన్ఎం కోశాధికారి చంద్రశేఖర్ ఇళ్లు, పరిశ్రమలపై ఈనెల 17,18 తేదీల్లో దాడులు నిర్వహించి రూ.11.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.80 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు. మరోఘటనలో చెన్నై పల్లవరం వద్ద వాహనాల తనిఖీలు చేసున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు ఒక కారులో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు పట్టుబడ్డాయి.
కావాలనే ఇలా తమ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని కమల్ హాసన్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఐటీ దాడులకు బెదిరేది లేదంటున్నారు. మరోవైపు తమిళనాడులో ఎన్నికలలో కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బుధవారం వరకు రూ.264 కోట్ల నగదు పట్టుబడిందట. ఇటీవల ఈరోడ్‌లో జరిపిన తనిఖీలో రూ. 4.5 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చిరాపల్లి–కరూర్ జాతీయ రహదారిపై బియ్యం బస్తాలను పరిశీలించగా రూ.500 నోట్లతో రూ. కోటి కరెన్సీని గుర్తించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు, నగలు పట్టుబడడంతో ఎన్నికల కమిషన్ 936 ఫ్లయింగ్ స్క్వాడ్లతో 24 గంటల నిఘా పెంచింది.