డబ్బు సంపాదించాలంటే డిగ్రీలు అక్కర్లేదు కాస్తంత బుర్రలో తెలివి ఉంటే సరిపోతుందని నిరూపించాడు ఓ ముంబై ఆటోవాలా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే నెలకు లక్ష, రెండు లక్షల జీతంతో సరిపెట్టుకుంటుంటే.. సదరు ఆటోవాలా మాత్రం ఏకంగా నెలకు రూ. 5 నుంచి 8 లక్షల వరకు సంపాదిస్తూ బిలినియర్ల దృష్టిని సైతం ఆకర్షించాడు. అస‌లు ఆటో డ్రైవర్ అయ్యుండి అంత పెద్ద మొత్తంలో ఎలా సంపాదిస్తున్నాడు..? అన్న విష‌యం ఇప్పుడు తెలుసుకుందాం.


అశోక్ అనే వ్య‌క్తి ముంబైలో ఆటో డ్రైవ‌ర్‌. అయితే ముంబైలో యూఎస్ కాన్సులేట్ ఆఫీస్ వద్దకు ప్ర‌తి రోజు వీసా ఇంట‌ర్వ్యూల కోసం వంద‌ల మంది వ‌స్తుంటారు. నిబంధనల ప్రకారం.. కార్యాల‌యం లోప‌లికి బ్యాగులు, సెల్‌ఫోన్లు తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. పోని వాటిని భద్రపరుచుకునేందుకు కార్యాల‌యం బ‌య‌ట కూడా ఎటువంటి లాక‌ర్లు ఉండ‌వు. దీంతో వీసా ఇంట‌ర్వ్యూ కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిల్చున్న జ‌నాలు చివ‌రి నిమిషంలో ఈ విష‌యం తెలుసుకుని తెగ హైరానా ప‌డిపోతుంటారు. త‌మ వ‌స్తువులు ఎక్క‌డ పెట్టాలో అర్థంగాక ఒత్తిడికి గుర‌వుతుంటారు.


అయితే స‌రిగ్గా ఈ స‌మ‌స్య‌నే అశోక్ త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నాడు. యూఎస్ కాన్సులేట్ ఆఫీస్‌కు ద‌గ్గ‌ర‌లోనే ఆటోను పార్క్ చేసుకుని.. ఎవ‌రైతే తమ వస్తువులను ఎక్కడ దాచుకోవాలో తెలియక ఇబ్బంది ప‌డుతున్నారో వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి `సర్, మీ బ్యాగ్ నాకు ఇవ్వండి, నేను దానిని సురక్షితంగా ఉంచుతాను, ఇది నా పని. అందుకు నేను రూ. 1,000 వసూలు చేస్తాను` అని చెప్పి తన సేవ‌లు అందిస్తున్నాడు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వీసా దరఖాస్తుదారులు కూడా అశోక్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డం స్టార్ట్ చేశారు.


అలా వీసా ద‌ర‌ఖాస్తుదారుల బ్యాగ్ హోల్డింగ్ స‌ర్వీస్ ద్వారా అశోక్ రోజుకు రూ. 20 వేల నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నాడు. ఈ లెక్క‌న నెల‌కు అత‌ను రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు అర్జిస్తున్నాడు. ఓ పారిశ్రామికవేత్త ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ స‌ద‌రు ఆటోవాలా తెలివిపై ప్ర‌శంస‌లు కురిపించారు. దీంతో ఆయ‌న‌ పోస్ట్ ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా అశోక్ సంపాద‌న గురించి తెలుచుకుని షాక‌వుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: