తిరుమల శ్రీవారికి బుధవారం త‌మిళ‌నాడు భ‌క్తులు బంగారు బిస్కెట్లు విరాళంగా అంద‌జేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్‌ సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలప్మెంట్‌ కంపెనీ ప్రతినిధులు రూ.1.83 కోట్ల విలువైన 3.604 కేజీల బంగారు బిస్కెట్లు శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామివారికి కానుకగా అంద‌జేశారు. ఈ బిస్కెట్లను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అదనపు ఈవో ధర్మారెడ్డికి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కంపెనీ ప్ర‌తినిధులు మాట్లాడుతూ స్వామివారికి ఈ బంగారంతో స్వ‌చ్ఛ‌మైన ఆభ‌ర‌ణాలు చేయించాల‌న్న ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేశామ‌ని, త‌యారీ బాధ్య‌త‌ను తితిదేకే అప్ప‌జెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. బుధ‌వారం తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగింది. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకొని వారికి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. మాస్క్ లేనివారిని అప్ర‌మ‌త్తం చేశారు. వీఐపీ దర్శ‌నాలు ఎక్కువ‌వ‌డంవ‌ల్ల సామాన్య భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌లుగుతోంద‌ని, వీఐపీలు త‌మ‌వెంట వ‌చ్చేవారిని క‌నీసం న‌లుగురైదురికి మించి ఎక్కువ‌మంది ఉండేలా చూడొద్ద‌ని అధికారులు కోరుతున్నారు. ఇటీవ‌ల మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ త‌న‌తోపాటు 60 మందిని ద‌ర్శ‌నాల‌కు తీసుకువెళ్ల‌డం వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: