ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో విద్యార్థినీ, విద్యార్థులు చాలా సెన్సిటివ్‌గా మారిపోతున్నారు. వారు పెరుగుతున్న వాతావరణమో.. చుట్టూ ఉన్న పరిస్థితులు కారణమో కానీ.. చిన్న చిన్న విషయాలకే విలువైన ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు. సుదీర్ఘమైన జీవితాన్ని అకస్మాత్తుగా ముగిస్తున్నారు. ఇలాంటి ఘటనే చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని అరుంబాక్కం, వినాయకపురంలో నివసించే సంజయ్ కుమార్(15) అనే విద్యార్థి స్థానిక పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నాడు. సంజయ్ శుభ్రతపై అంతగా దృష్టి పెట్టే వాడు కాదు. జుట్టు పెంచుకుని, యూనిఫాం లేకుండా పాఠశాలకు తరచుగా వస్తుండేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా ఇలానే పాఠశాలకు వచ్చాడు. దాంతో క్లాస్ టీచర్ అతడిని మందలించింది. ఇలా అయితే పాఠశాలకు రావద్దని, తల్లిదండ్రులను పిలుచుకురావాలని క్లాస్ టీచర్ కోప్పడింది. దీంతో ఇంటికి తిరిగి వచ్చేశాడు.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో సంజయ్ ఇంటికి చేరుకున్నాడు. రోజూలా కాకుండా ముందుగా ఇంటికి వచ్చేయడంతో తల్లిందండ్రులు అతడిని ఏమైందని అడిగారు. కానీ సంజయ్ ఏమీ చెప్పకుండా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దీంతో అతడు ఏదో పనిలో ఉన్నాడనుకుని తల్లిదండ్రులు ఊరుకున్నారు. కానీ ఎంత సేపటికీ తలుపులు తెరవకపోవడం, మధ్యాహ్నం భోజనానికి కూడా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లారు. అంతే అక్కడి దృశ్యం చూసి వారి గుండె ఆగినంత పనైంది. సంజయ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఇద్దరూ తీవ్ర ఆవేదనకు గురై అక్కడే బోరున విలపించారు.

సమాచారం తెలుసుకున్న చూలైమేడు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంజయ్‌కుమార్‌ జుట్టు ఎత్తుగా పెంచుకోవడంతో దానిని కత్తిరించుకొని పాఠశాలకు రావాలని ఉపాధ్యాయుడు మందలించాడని, అందువల్ల మనస్తాపానికి గురైన సంజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెల్లడైంది.

ఇదిలా ఉంటే ఈ ఘటనలో మరో కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్‌కుమార్‌ తన తరగతికే చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించాడని, అయితే అతని ప్రేమను ఆ విద్యార్థిని అంగీకరించలేదని, ఆ కారణంగా కూడా అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: