రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఒక దగ్గర అమాయకులు మోసపోతూనే ఉన్నారు. కేటుగాళ్ళు సైతం అమాయకులను మోసం చేసేందుకు కొత్త దారులను వెతుకుతున్నారు. అయితే ఇప్పటివరకు చూసిన ఆన్లైన్ మోసాలు ఒక లెక్క తాజాగా జరిగిన ఆన్లైన్ మోసం ఒక లెక్క అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఒకే ఆన్లైన్ మోసానికి సంబంధించి ఏకంగా ఎనిమిది సార్లు మోసపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...ఈస్ట్ మరేడిపల్లికి చెందిన సునీల్ అనే వక్తి తన ఇంట్లోని సోఫాను ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టాడు. దాని ధరను రూపాయలు 6500 గా నిర్ణయించారు. కాగా తనకు సోఫా కావాలంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశారు. అంతే కాకుండా ఎలాంటి బేరమాడకుండా చెప్పిన ధరకే సోఫాను కొంటానని చెప్పారు. 

దాంతో ఖుషీ అయిన సునీల్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు..సోఫా ఎప్పుడు తీసుకెళతారని అడిగారు. కాగా డబ్బులు ఇప్పుడే ఇస్తానని కేటుగాడు నమ్మించాడు. ఫోన్ కు ఒక క్యూ ఆర్ కోడ్ ను పంపుతానని దాన్ని స్కాన్ చేస్తే డబ్బులు ఖాతాలో పడతాయని చెప్పాడు. వెంటనే సునీల్ కు క్యూ ఆర్ కోడ్ రాగా దాన్ని స్కాన్ చేసాడు. కానీ డబ్బులు రాలేదు కదా..అకౌంట్ లో ఉన్న డబ్బులు మాయమయ్యాయి. దాంతో షాక్ తిన్న సునీల్ వెంటనే ఫోన్ చేసి అడగ్గా పొరపాటు జరిగిందేమో అని మరోసారి స్కాన్ చేయాలని చెప్పారు. కేటుగాడి మాటలు నమ్మి స్కాన్ చేయగా మళ్ళీ అకౌంట్ లో నుండి డబ్బులు మాయమయ్యాయి. అలా ఒకటి కాదు రెండు కాదు మాయమాటలు నమ్మి 8 సార్లు సునీల్ స్కాన్ చేశారు. దాంతో తన ఖాతాలో ఉన్న లక్షా 96వేలు మాయమయ్యాయి. ఇక మోసపోయినట్టు గ్రహించిన సునీల్ లబో దినోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: