దేశ‌వ్యాప్తంగా తెలంగాణ‌ రాష్ట్రంలో దిశా కేసు సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. దిశా కేసు నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసిన కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న‌ది.  దిశ ఎన్‌కౌంటర్‌పై  సిర్పూర్కర్ కమిషన్ విచారణ చేప‌డుతూనే ఉన్న‌ది.  ఆ ఘటన జరిగిన ప్రాంతంలో ఇవాళ క‌మిష‌న్  పర్యటించిన‌ది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్, దిశ మృతదేహం దహనం చేసిన స్థలాలను సిర్పూర్కర్‌ కమిషన్  బృందం సభ్యులు  ఆదివారం పరిశీలించారు.

ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా  భారీ భద్రత మధ్య కమిషన్ సభ్యులు పర్యటించారు. దాదాపు ఒక గంటపాటు ఘటన జరిగిన ప్రాంతంలో ఉండి ఆరా తీసారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను కూడా సందర్శించారు.  పోలీస్ స్టేష‌న్‌లో మరిన్ని వివరాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అయితే కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీస్ స్టేష‌న్‌ ఎదుట  ఆందోళనకు దిగారు వివిధ సంఘాల నాయకులు.

 కమిషన్ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమాచారం అందుకున్న ప్రజా, యువజన సంఘాల నాయకులు  పెద్ద ఎత్తున ఆందోళన చేప‌ట్టారు.  పోలీస్ స్టేష‌న్ వద్దకు చేరుకుని కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తక్షణమే కమిషన్‌ను రద్దు చేయాలని పీఎస్ ఎదుట బైఠాయించారు. కమిషన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేసారు. ఇవాళ‌ పరిస్థితి తీవ్రతరం కావడంతో షాద్‌న‌గ‌ర్‌ పోలీసులు ఆందోళనకారులను నిలువరించారు.

ఓ వైపు ఆందోళన కొనసాగుతుండగానే కమిషన్ సభ్యులు దిశను హత్యాచారం చేసిన శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో గల ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లారు.  అక్కడ దిశ తన ద్విచక్ర వాహనంతో నిలిచి ఉన్న ప్రాంతంతో పాటు ఆమెను అత్యాచారం చేసిన ప్రదేశాన్ని ఇవాళ వారు పరిశీలించారు. అదేవిధంగా  చటాన్‌పల్లిలో పోలీసులు మీడియాను కూడా  అనుమతించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  2019 డిసెంబర్‌ 6న చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో నలుగురు మృతిచెందిన విషయం అందిరికీ తెలిసిన‌దే. 2022  ఫిబ్రవరిలో సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం క‌నిపిస్తున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: