
అయితే సాధారణంగా పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది అంటే అందుకు కారణం కట్నకానుకలు ముందు మాట్లాడుకున్న విధంగా ఇవ్వకపోవడం లేదంటే వధూవరులలో ఎవరో ఒకరు మంచివారు కాదు అని సరిగ్గా పెళ్లి ముహూర్తానికి తెలియడం లాంటి కారణాలు ఉంటాయి. కానీ ఏకంగా ఒక మటన్ బొక్క కారణంగా పెళ్లి క్యాన్సిల్ అవడం గురించి ఎప్పుడైనా విన్నారా.. మటన్ బొక్క కారణంగా పెళ్లి క్యాన్సిల్ అవడం ఏంటి.. అలా ఎక్కడైనా జరుగుతుందా అంటారు ఎవరైనా. కానీ ఇటీవల నిజాంబాద్ జిల్లాలో మాత్రం ఇలాంటి వింతైన కారణం తోనే పెళ్లి క్యాన్సిల్ అయింది.
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన అబ్బాయికి నిజాంబాద్ కు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. అయితే నవంబర్ నెలలో వీరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ వేడుకలో అమ్మాయి ఇంట్లో మటన్ భోజనం ఏర్పాటు చేశారు. అయితే అబ్బాయి బంధువులు ములుగు బొక్క కావాలని కోరారు. కానీ ఎంత వెతికినా ములుగు బొక్క దొరకకపోవడంతో ఇక వధూవరుల కుటుంబీకులకు గొడవ జరిగింది. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇటీవల ఇరు కుటుంబ సభ్యులు కూడా చివరికి పెళ్లిని రద్దు చేసుకున్నారు అని చెప్పాలి. ఇలా ఏకంగా మటన్ బొక్క కారణంగా పెళ్లి రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడింది.