
భారత్-చైనా మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగానే జరిగి మళ్ళీ కాల్పులు మొదలు పెట్టినట్లుగా ఉంది స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన జోరు తగ్గించినట్లుగానే తగ్గించి మళ్ళీ వరుసబెట్టి మంత్రులు, ఎంఎల్ఏలపై నిషేధాలు విధిస్తున్నారు. తాజాగా ఎంఎల్ఏ జోగి రమేష్ విషయంలో నిషేధం విధించిన నిమ్మగడ్డ మంత్రి కొడాలి నాని విషయంలో మరింత దూకుడుగా వెళుతున్నారు. నానిపై నిషేధం విధించటమే కాకుండా ఏకంగా కేసు కూడా నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించటమే ఆశ్చర్యంగా ఉంది. ముందురోజు మీడియాతో మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజే ఏకంగా కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించారు. మంత్రి వ్యాఖ్యలు శాంతికి విఘాతం కలిగించేవిధంగా ఉన్నట్లు నిమ్మగడ్డకు అనిపించిందట. అందుకనే కేసు నమోదు చేయమని ఆదేశించారు.
మంత్రి వ్యాఖ్యలు శాంతికి విఘాతం కలిగించేవిధంగా ఉన్నట్లు నిమ్మగడ్డకు అనిపించిందట. అందుకనే కేసు నమోదు చేయమని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు శాంతికి విఘాతం కలిగించేలా, అధికారులను బెదిరించేలా మంత్రి వ్యాఖ్యలున్నట్లు నిమ్మగడ్డ భావించారు. సరే నిమ్మగడ్డ ఆదేశిస్తే ఏమవుతుంది ? ఎస్పీ ఏమి చేస్తారన్నది వేరే సంగతి. ఆమధ్య మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. మీడియాతో మాట్లాడద్దన్నారు. మంత్రిని ఎన్నికలయ్యే వరకు హౌస్ అరెస్టు చేయాలన్నారు. నిమ్మగడ్డ ఆదేశాలపై మంత్రి కోర్టుకెళ్ళారు. ఆదేశాలను పరిశీలించిన కోర్టు నిమ్మగడ్డ ఆదేశాలు చెల్లవని కొట్టేసింది.
ఇపుడు జోగి విషయంలో అయినా, కొడాలి విషయంలో అయినా కోర్టు ఇలాగే స్పందించే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిషేధాలు విధించే విషయంలో తనకు లేని అధికారాలను నిమ్మగడ్డ యధేచ్చగా వాడేస్తున్నారు. మళ్ళీ మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు మాత్రం నిబంధనలను పాటించాల్సిందే, కోడ్ ప్రకారం నడుచుకోవాల్సిందే అని సుద్దులు చెబుతున్నారు. నిమ్మగడ్డ ఆదేశాలపై ఇద్దరు కోర్టులో కేసు వేశారు. మరి న్యాయస్ధానం ఏమి తీర్పు ఇస్తుందో చూడాల్సిందే.