
కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ లో యావత్ దేశాన్ని వణికించేస్తోంది. పోయిన సంవత్సరం వచ్చిన వైరస్ కన్నా సెకెండ్ వేవ్ మరింత వేగంగాను, ప్రమాధకారిగా వ్యాపిస్తోంది. సెకెండ్ వేవ్ లో వైరస్ ప్రధానంగా యువతనే టార్గెట్ చేసినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మామూలుగా అయితే యువతలో ఇమ్యూనిటి పవన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి కరోనా సోకినా వెంటనే బయటపడదు. బయటకు ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకపోవటంతో యువత యధేచ్చగా బయట తిరిగేస్తున్నారు. దీనివల్ల చాలామందికి కరోనా వైరస్ ను అంటుకుంటోంది. ఇలా వైరస్ సోకినవారిలో పిల్లలు, వృద్ధులుంటే వెంటనే ఎఫెక్టయి ఆసుపత్రిలో చేరుతున్నారు. కానీ సెకెండ్ వేవ్ లో అలా కాకుండా చిన్న పిల్లలతో పాటు యువత కూడా డైరెక్టుగా ఎఫెక్టయిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
తెలంగాణా ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారమే నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 56 శాతం మంది 40 ఏళ్ళలోపు వారేనట. 21-40 ఏళ్ళమధ్య ఉన్న వారిలో 43 శాతంమందికి కరోనా సోకినట్లు నిర్ధారణయ్యిందట. విద్య, ఉపాధి అవసరాల కోసం యవత బయటకు వస్తుండటంతో పాటు నిర్లక్ష్యం కూడా యువత టార్గెట్ అవటానికి కారణాలుగా కనబడుతున్నాయి. కరోనా వైరస్ మొదటి దశలో యువతపైన చూపిన ప్రభావం తక్కువనే చెప్పాలి. కారణం ఏమిటంటే అప్పట్లో కరోనా వైరస్ స్వరూపం ఏమిటో ఎవరికీ తెలీదు కాబట్టి మిగిలిన వాళ్ళలాగే యువత కూడా ఎక్కువభాగం ఇంటికే పరిమితమయ్యారు. అయితే మొదటి దశలో రిలాక్సయిపోవటంతో అందరికన్నా ఎక్కువగా బయటతిరిగింది యువతేనట. ఈ కారణంగానే సెకెండ్ వేవ్ మొదలైనా యువత పట్టించుకోలేదు.
ఎందుకంటే కరోనా వైరస్ అంటే భయంపోవటం, ఎక్కువ రోజులు ఇంట్లో కూర్చోలేకపోవటంతో యువత ఎక్కువగా రోడ్లపైకి వచ్చేశారు. దానికితోడు భౌతిక దూరం పాటించకపోవటం, మాస్కు వేసుకోవటం లాంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవటంతో కరోనా వైరస్ యువతపైనే డైరెక్టుగా ఎటాక్ చేస్తోంది. తాజా లెక్కల ప్రకారం 0-10 ఏళ్ళలోపు పిల్లలు 2.7 శాతం మందిలో కరోనా వైరస్ సోకిందట. అలాగే 11-20 ఏళ్ళలోపు వాళ్ళు 10.5 శాతం ఉన్నారు. కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవటం కూడా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైంది. పెరిగిపోతున్న కేసులు, ఆక్సిజన్ అందకపోవటం, పెరిగిపోతున్న మరణాలపై స్వయంగా హైకోర్టు తీవ్రంగా స్పందించిన కారణంగానే ప్రభుత్వం మేల్కొంది. లేకపోతే జనాల ప్రాణాలకు దేవుడే దిక్కయ్యేవాడు. మొత్తంమీద సెకెండ్ వేవ్ లో యువత జాగ్రత్తగా ఉండాలని లెక్కలు చెబుతున్నాయి.