
మొసలికి నీళ్ళల్లో ఉండటమే బలమంటారు. అలాగే చంద్రబాబునాయుడుకు మీడియానే బలం. ఈ మీడియాను చూసుకునే ప్రత్యర్ధులపై రెచ్చిపోతుంటారు. అన్నీసార్లు ఈ మీడియానే చంద్రబాబును ఆదుకోలేకపోయినా మెజారిటి సందర్భాల్లో ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలోని మైనస్ పాయింట్లు జనాలకంట పడకుండా కప్పేస్తుంటుంది. ఇదే సందర్భంలో చంద్రబాబు ప్రత్యర్ధులపై చంద్రబాబు కోసమనే సొంతంగా బురదచల్లేస్తుంటుంది. ఏదేమైనా ఈ మీడియా ఉద్దేశ్యం మాత్రం స్పష్టంగా ఉంటుంది. అదేమిటంటే మొదటిది చంద్రబాబు ఇమేజిని (లేకపోయినా) ఆకాశానికెత్తేయటం. ఇక రెండోదేమిటంటే ప్రత్యర్ధుల ఇమేజి డ్యామేజయ్యేట్లుగా బురద చల్లేయటం.
ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా ఎన్టీవీలో ‘ప్రాంతీయమే జాతీయం’ అనే అంశంతో ఓ కథనం వచ్చింది. ఇదేమిటంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ప్రసారమైన కథనం. ఇందులో ఎనిమిదిమంది నేతల ఫొటో పెట్టి కథనాన్ని అందించారు. ఆ ఎనిమిదిమంది ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రులు కేసీయార్, పినరయి విజయన్, మమతబెనర్జీ, ఎంకే స్టాలిన్. అంటే స్టాలిన్ 7వ తేదీన సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కాబట్టి సీఎం హోదాలో ఫొటో పెట్టేయటంలో తప్పులేదు. వీళ్ళ పొటోలను పై వరసలో పెట్టారు. ఇక కిందవరసలో మరో నలుగురు ఫొటోలు పెట్టారు. వీళ్ళల్లో అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రే, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మరి చివరిది, ఎనిమిదో నేత ఎవరు ? ఎవరిదంటే చంద్రబాబుది.
నిజానికి ఈ స్టోరీలో చంద్రబాబు గురించి అవసరమే లేదు. ఎందుకంటే చంద్రబాబు సీఎం కాదు. పోనీ బలమైన ప్రతిపక్ష నేతా అంటె అదీకాదు. లోక్ సభలో టీడీపీకి ఉన్నదే 3 సీట్లు. ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో ఎన్డీయే చంద్రబాబును దగ్గరకు రానీయటంలేదు. అలాగే ఎన్డీయేతర పార్టీలూ చంద్రబాబును నమ్మటంలేదు కాబట్టే ఏ విషయంలో కూడా కలుపుకోవటంలేదు. దీనికంతటికి చంద్రబాబు ఆడిన త్రిబుల్ గేమే కారణం. అవసరానికి నరేంద్రమోడితో కలిశారు. 2019 ఎన్నికలకు ముందు మోడితో లాభం లేదని అనుకోగానే వెంటనే కాంగ్రెస్ తో జతకట్టారు. ఇదే సమయంలో మమత, స్టాలిన్, కేజ్రీవాల్ లాంటి వాళ్ళతో జట్టుకట్టారు. మళ్ళీ మోడినే అధికారంలోకి రావటంతో అందరినీ వదిలేసి మళ్ళీ మోడికి దగ్గరవుదామని శతవిధాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇలాంటి విశ్వసనీయత లేని చేష్టలతో చివరకు చంద్రబాబు అందరికీ దూరమయ్యారన్నది వాస్తవం. ప్రస్తుతం టీడీపీ అంటే ముణిగిపోయే పడవ అనే చర్చ జరుగుతోంది రాష్ట్రంలో. ఇలాంటి నేపధ్యంలోనే ఏడుగురు సీఎంలతో కలిపి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయటంలో సదరు మీడియా ఎందుకింత ఉత్సాహం చూపిందో ఎవరికీ అర్ధం కావటంలేదు.