
దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఈ ఫంగస్ సోకి 90మంది మరణించగా, రాజస్థానంలో 100మందికిపైగా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకి చికిత్స పొందుతున్నారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌ను అటు వ్యాధిగా ప్రకటించి చికిత్సకోసం ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగస్ ప్రభావం కనిపిస్తుంది. అయితే ఎక్కువ స్థాయిలో మధుమేహం, డయాబెటిక్ కెటోయాసిడోసిస్ ఉన్నవారు, మోతాదుకు మించి స్టెరాయిడ్స్, టోసిలిజుమాబ్ వాడే రోగులు ఫంగస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ తెలిపింది. అదేవిధంగా రోగనిరోధక మందులు అధికంగా వాడటం, యాంటీ కాన్సర్ చికిత్స పొందేవారు, ధీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారు, కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఈ ఫంగస్ బారినుండి బయటపడినవారిని క్రమం తప్పకుండా వైద్యులు పరీక్షలు నిర్వహించాలని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు.
బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో ముక్కు నుండి అసాధారణమైన నలుపు రంగు స్రావం రావడం, తలనొప్పి, కంటి నొప్పి, కళ్లచుట్టూ వాపు, చూపు మందగించడం, కళ్లు ఎరుపుగా మారడం, కన్ను మూసుకుపోవడం, తెరవలేక పోవడం వంటివి ఉంటే బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాక ముఖం తిమ్మిరిగా ఉండటం, నోరు తెరవలేక పోవడం, నమలడంలో ఇబ్బందిగా ఉంటే బ్లాక్ ఫంగస్‌కు సోకిందని గుర్తిచండానికి లక్షణాలుగా భావించాలని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ఈ ఫంగస్ సోకిందని భావిస్తే వెంటనే నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలని వారు సూచించారు. రెగ్యులర్‌గా చికిత్స తీసుకోవటం, ఎప్పటికప్పుడు మధుమేహం తీవ్రతను చెక్‌చేయించుకోవటం వంటివి చేయాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ కోసం సిటీ స్కాన్, ఎంఆర్ ఐ పరీక్షలు, పారానాసల్ సైనసెస్ అవసరమైతే డాక్టర్ సలహా మేరకు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.