
‘కోవాగ్జిన్ టీకా ఫార్ములాను ఎవరితోను పంచుకునేది లేదు. టీకా తయారీ మొత్తం మా శ్రమ ఫలితమే’.
‘దాని పేటెంట్ హక్కులు కూడా పూర్తిగా మావే’ ..ఇవి తాజాగా భారత్ బయెటెక్ జేఎండీ సుచిత్రా ఎల్లా చేసిన వ్యాఖ్యలు. ఆమె వ్యాఖ్యల్లో ఫక్తు కమర్షియల్ యాంగిల్ తప్ప జనాల శ్రేయస్సే ఎక్కడా కనబడటంలేదు. ఒకవైపు జనాలందరికీ అవసరమైన టీకాలను ఉత్పత్తి చేయలేకపోతున్నది కంపెనీ. మరోవైపు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా జనాలందరు భయంతో టీకాల కోసం క్యూలైన్లలో పోటెత్తుతున్నారు. సరే కరోనా వైరస్ సోకిన రోగులు లక్షలాదిమంది కళ్ళముందే పిట్టల్లా రాలిపోతున్నారు. ఇదంతా కళ్ళముందే జరుగుతున్నా టీకాల ఉత్పత్తిని పెంచటం కోసం దాని ఫార్మాలాను ఇతర ఫార్మాకంపెనీలకు కూడా బదిలీచేసి ఆ కంపెనీల్లో కూడా ఉత్పత్తి చేయించాలన్న కనీసం మానవీయ కోణం కూడా ఆమెలో లేకపోవటమే విచిత్రం.
ఫార్మాకంపెనీ పెట్టుకున్నది జనాలకు సేవ చేయటానికి ఏమీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే యావత్ ప్రపంచమంతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే తమ కంపెనీకి లాభాలే తప్ప సర్వజన శ్రేయస్సు పట్టదన్న విషయాన్ని సుచిత్ర చెప్పకనే చెప్పారు. నిజానికి ప్రపంచమంతా విపత్తులో ఉన్నపుడు పేటెంట్ అని, ఫార్ములాను ఇతర కంపెనీలకు ట్రాన్స్ ఫర్ చేసేది లేదని చెప్పటం అమానవీయమే. దీన్ని ఏ దేశం, ఏ ప్రభుత్వం కూడా అంగీకరించకూడదు. జనాలందరికీ అవసరమైన టీకాలను ఉత్పత్తి చేయలేకపోతున్నపుడు తమ ఫార్ములాను ఇతర కంపెనీలకు బదిలీచేసి అక్కడ కూడా ఉత్పత్తి చేయించటం ఒకటే మార్గం. కానీ దానికి సుచిత్ర ఒప్పుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇక్కడే అనివార్యంగా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వైద్యుడు ఆనందయ్యకు సుచిత్రకు పోలిక తెస్తున్నారు నెటిజన్లు. ఫార్ములపై సుచిత్ర చేసిన తాజా వ్యాఖ్యలను ఆనందయ్య చెప్పిన మాటలను నెటిజన్లు విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. కరోనా వైరస్ విషయంలో ఆయుర్వేధం (సిద్ధ) వైద్యుడు ఆనందయ్య మాట్లాడుతు ప్రజల ప్రాణాలను పోగొట్టుకోవటం చూళ్ళేకే తాను మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఆనందయ్య ఇప్పటికి సుమారు 80 వేలమందికి తన చుక్కల మందును పంపిణీచేశారు. ఆ మందు ఎంతమందికి ఎలా పనిచేసిందో స్పష్టతలేదు. అయితే చుక్కల మందు తీసుకున్న తర్వాత తమకు ఇబ్బందులు వచ్చాయని కానీ అనారోగ్యం వచ్చిందని కానీ ఎవ్వరూ చెప్పలేదు. మరి ఇక్కడే సుచిత్రా ఎల్లాకు ఆనందయ్యకు తేడా తెలిసిపోతోంది.