2019లో అధికారాన్ని కోల్పోవడం, అందులోనూ కేవలం 23 సీట్లకే పరిమితం కావడం చంద్రబాబు స్వయంకృతాపరాధమే అంటారు చాలామంది. కానీ టీడీపీ నేతలు మాత్రం జగన్, 'ఒక్క ఛాన్స్' అని అడగడం వల్లే ప్రజలు వైసీపీకి అధికారమిచ్చారని సర్దిచెప్పుకుంటారు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారనేదానికంటే, అమరావతికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చి చంద్రబాబు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ వెళ్లినా కేవలం అమరావతికోసమే లాబీయింగ్ చేసేవారే కానీ, రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే కార్యక్రమాల గురించి ఎప్పుడూ కేంద్ర మంత్రులతో చర్చించలేదని కూడా చంద్రబాబుపై విమర్శలున్నాయి. ఇక హస్తినలో బాబు వ్యక్తిగత రాజకీయాలకు, జగన్ పై కక్షసాధింపు కోసమే ఎక్కువగా కష్టపడ్డారని కూడా అంటారు.

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చాలా సార్లు ఢిల్లీ వెళ్లారు, కొన్నాళ్లు ఎన్డీఏలో కూడా టీడీపీ భాగస్వామిగా ఉంది. అయితే బీజేపీతో పొత్తు ఉన్నా, లేకున్నా కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారంటే, ఇక్కడ జగన్ కి ఏదో అపాయం పొంచి ఉందనే ప్రచారం జరిగేది. సీబీఐ కేసులు, ఇతర వ్యవహారాల్లో జగన్ ని కట్టడి చేసేందుకే బాబు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని అంటారు. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని కూడా చెబుతారు. ఢిల్లీ పర్యటనలన్నిటినీ ఇలా తన వ్యక్తిగత రాజకీయాలకోసమే ఉపయోగించుకున్న బాబు, ప్రత్యేక హోదా విషయంలో చేతులు కట్టుకోవాల్సి వచ్చిందనే అపవాదు ఉంది.

బాబు జమానా రెండేళ్ల క్రితమే అయిపోయింది. ఈ రెండేళ్లనుంచి జగన్ ఢిల్లీ పర్యటనలు మొదలయ్యాయి. మరి జగన్ హయాంలో జరుగుతున్నదేంటి? ఏపీ సీఎం, ఢిల్లీకి వెళ్లి ఇప్పటి వరకూ ఏం సాధించుకొచ్చారు? చంద్రబాబు చేయలేని పనుల్ని జగన్ చేస్తున్నారా, లేదా అనేదే ఇప్పుడు ప్రశ్న. ప్రత్యేక హోదాపై సమాచారం లేదు, విభజన హామీలు ఇంకా పూర్తిగా నెరవేరలేదు. పోలవరం విషయంలో అంచనాలు పెంచిన ప్రతిసారీ కొర్రీలు వేస్తున్నారే కానీ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేంద్రం తన పూర్తి సహకారం అందిస్తుందన్న ఆశ ఏపీ ప్రజల్లో లేదు. మరి జగన్, కేంద్ర మంత్రులతో ఏం చర్చించారు? ఎలాంటి హామీలు పొందారు?

రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చినప్పుడు కేంద్రం కొత్తగా ఫలానా వరాలు ప్రకటించింది అని చెప్పుకుంటారు. కానీ ఏపీ విషయంలో మాత్రం ముఖ్యమంత్రులు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా వారి వ్యక్తిగత అజెండాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. జగన్ ఢిల్లీ వెళ్లినా టార్గెట్ చంద్రబాబు, లేదా రఘురామకృష్ణంరాజు అనే పరిస్థితే కనిపిస్తుంది. ఒకరకంగా హస్తిన రాజకీయాల విషయంలో చంద్రబాబు చేసిన తప్పుల్నే జగన్ రిపీట్ చేస్తున్నారని అనుకోవాల్సిన సందర్భం. కేంద్ర మంత్రులతో  ఏయే అంశాలు చర్చించారు, ఎంతవరకు హామీలు పొందగలిగారు.. అనే వాటిపై జగన్ కూడా ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాఖలాలు లేవు. ఇటు వైసీపీ నేతలు కూడా.. జగన్ పర్యటనలో విభజన హామీలు చర్చించారని చెబుతారే కానీ, సూటిగా, స్పష్టంగా ఈ కేటాయింపులు పెరిగాయి, దీనిపై క్లారిటీ వచ్చింది అని చెప్పుకునే పరిస్థితి లేదు. మరి ఈ పర్యటనల వల్ల ప్రయోజనం ఏంటి..? చంద్రబాబుకి, జగన్ కి తేడా ఏంటి..? కేంద్రంలో ఎన్డీఏ బలంగానే ఉండొచ్చు, కాదనలేం, కానీ రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం నాయకులకు ఉందా లేదా..? ఫలానా రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారంటే.. ఏమేం కావాలంటారో, ఎలా ఒత్తిడి తెస్తారో అని కేంద్ర మంత్రులు ఇబ్బంది పడాలి కానీ, ఏదో ఒకటి చెప్పి పంపించొచ్చులే అనేలా ఉండకూడదు. ఢిల్లీలో ఏపీ రాజకీయాలు చూస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి. అప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జగన్ ని టార్గెట్ చేస్తే, ఇప్పుడు జగన్, చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: